WhatsApp AirDrop Like Feature :వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను యూజర్లకు అందిస్తూ సరికొత్తగా రూపును సంతరించుకుంటోంది. త్వరలో మరో అడ్వాన్స్‌డ్ ఫీచర్‌ను విడుదల చేసేందుకు వాట్సాప్ కసరత్తు చేస్తోంది. ఆ ఫీచర్ అచ్చం యాపిల్ ఐఫోన్లలోని 'ఎయిర్ డ్రాప్' ఫీచర్‌ను తలపించేలా ఉంటుందని అంటున్నారు. ఒక ఐఫోన్ నుంచి మరో ఐఫోన్‌కు ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫైల్స్‌ను బదిలీ చేసే వసతి ఉండటం అనేది ఈ ఫీచర్‌లోని ప్రత్యేకత. గతంలోనే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లలో టెస్ట్ చేశారు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫైల్స్‌ను షేర్ చేసే ఈ ఫీచర్‌ను ఇప్పుడు 'టెస్ట్‌ఫ్లయిట్ బీటా' ప్రోగ్రాం ద్వారా వాట్సాప్ బీటాలో పరీక్షిస్తున్నారు. ప్రత్యేకంగా ఐఓఎస్ వెర్షన్ 24.15.10.70లో ఈ ఫీచర్‌ను టెస్టు చేస్తున్నారని తెలుస్తోంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి
ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇంటర్నెట్ లేదా వైఫై అవసరం లేకుండానే ఫోన్‌లోని వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర మీడియాలను మరో ఫోనుకు పంపొచ్చు. ఎలా అంటే? ఫైల్స్‌ను పంపే వ్యక్తి వాటి బదిలీ ప్రక్రియను మొదలుపెట్టగానే, వాటిని స్వీకరించే వ్యక్తి ఫోనులో ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. దాన్ని ఫైల్స్ రిసీవ్ చేసుకునే వ్యక్తి ధ్రువీకరించి, సెండ్ చేసే వ్యక్తికి చూపించాలి. సెండ్ చేసే వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే ఫైళ్ల బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి ఐఓఎస్ ఫోన్లకు, ఐఓఎస్ ఫోన్ల నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈవిధంగా ఫైళ్లను బదిలీ చేయొచ్చు. ఈ ఫీచర్ ఎప్పుడు విడుదల అవుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఐఫోన్లలో ఎయిర్‌డ్రాప్ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉన్నందున, దానికి ధీటుగా అచ్చం అదే తరహా ఫీచర్‌ను ఏ విధంగా వాట్సాప్ ప్రవేశపెడుతుందో వేచిచూడాలి. ఆండ్రాయిడ్‌లో ఈ ఫీచర్‌కు మంచి ఆదరణ లభిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.