Look Between Trend : సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూలనున్న విషయమైనా క్షణాల్లో అందరికీ తెలిసిపోతోంది. అయితే దీనితో ఎన్ని లాభాలున్నాయో, అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వార్తలు నిజమేనా, కాదా అని నిర్ధరణ చేసుకోకముందే వాటిని చాలా మంది షేర్ చేస్తుంటారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో సులభంగా తెలుస్తుంది.
అందుకే ఆ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని, వెంటనే పోస్టులు కూడా పెడుతుంటారు. ఇంకొందరైతే ఈ పోస్టులకు అర్థాన్ని తెలుసుకోలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు. ప్రస్తుతం అలా ట్రెండ్ అవుతున్నదే 'లుక్ బిట్ వీన్ యువర్ కీ బోర్డు ట్రెండ్'. ఇంతకీ ఏమిటీ ట్రెండ్? ఎక్కడ మొదలైంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
'లుక్ బిట్ వీన్ H అండ్ L ఆన్ యువర్ కీ బోర్డు' అంటూ కొందరు పోస్టులు షేర్ చేస్తున్నారు. సాధారణంగా మనం వాడే కీబోర్డుల్లో వాటి మధ్య లెటర్స్ JKఅని ఉంటాయి. దాని అర్థం జస్ట్ కిడ్డింగ్ అని. ఇంటర్వ్యూయర్ చూపు ఎప్పుడూ X అండ్ B మధ్య ఉంటుందని ఓ వ్యక్తి పోస్టు చేశాడు. అభ్యర్థి CVపైనే ఫోకస్ ఉంటుందన్న అర్థంలో దాన్ని పోస్టు చేశాడు. ఇవేకాదు ఇలా కీబోర్డులోని వివిధ అక్షరాలతో తమదైన శైలిలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెటిజన్లే కాదు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, అమెజాన్ ప్రైమ్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, స్విగ్గీ కూడా ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని పోస్టులు పెట్టాయి.