What Is Digital Arrest :ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో రకంగా మాయచేసే జనాల జేబులో చేతులు పెట్టేస్తున్నారు. ఒకప్పుడు సైబర్ నేరాలంటే.. పిన్ నెంబర్ తెలుసుకుని బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు ఖాళీ చేయడం, ఓటీపీ ద్వారా సొమ్మును దొంగిలించడం, పార్ట్‌టైమ్ జాబ్ ఆఫర్స్ వంటివి ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ ఔట్ డేటెడ్ పద్ధతులు. సరికొత్త టెక్నాలజీని వినియోగించుకుని కొత్తకొత్త మోసాలకు పాల్పడుతున్నారు. అలాంటి వాటిల్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నది "డిజిటల్ అరెస్ట్" ఈ పద్ధతి ద్వారా జనాల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్నారు. మరి.. ఈ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ? దీని బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి ?
సాధారణంగా ఎవరైనా ఏదైనా నేరం చేస్తే.. పోలీసులు నేరుగా వచ్చి అరెస్ట్ చేస్తారు. కానీ.. ఇక్కడ సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో అరెస్ట్ చేస్తారు. అది ఎలా అంటే.. సైబర్ నేరగాళ్లు మీకు ఒక వీడియో కాల్ చేస్తారు. తాము పోలీసులమని, దర్యాప్తు అధికారులమని నమ్మిస్తారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు, ఆధార్ కార్డు వంటి వాటిని మీరు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు వినియోగించుకున్నారని బెదిరిస్తారు. లేదంటే మీ పేరుతో డ్రగ్స్ దొరికాయని చెబుతారు. విచారణ పూర్తయ్యేంత వరకు వీడియో కాల్‌ను కట్ చేయడానికి వీళ్లేదని చెబుతారు. పలు రకాల మాటలతో భయభ్రాంతులకు గురి చేస్తారు.
చివరకు మీరు ఈ కేసు నుంచి బయట పడాలంటే.. డబ్బులను ఇవ్వాలని అంటారు. లేదంటే.. జీవితాంతం జైల్లో మగ్గిపోవాల్సి వస్తుందని బెదిరిస్తారు. ఇదంతా వింటున్న బాధితులకు ఏం చేయాలో అర్థంకాదు. ముందు ఆ సమస్య నుంచి బయటపడాలనే ఆరాటంలో.. వాళ్లు అడిగినంత డబ్బు చెల్లిస్తారు. ఇలా.. మనిషిని ఎక్కడికీ వెళ్లనివ్వకుండా ఒక స్క్రీన్ ముందు నిర్బంధించి దోచుకోవడాన్నే 'డిజిటల్ అరెస్ట్' అంటారని నిపుణులు చెబుతున్నారు.
డిజిటల్ లోన్ తీసుకుంటున్నారా? ఇచ్చేవాళ్లు ఫేక్ బ్యాచ్ అయితే డేంజర్! ఇలా చెక్ చేయండి