Uber Denies Allegations:ఆన్‌లైన్ టాక్సీ సర్వీస్ కంపెనీలు ఓలా, ఉబర్ రెండూ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఇప్పుడు ఈ రెండు కంపెనీలకు కేంద్ర వినియోగదారుల రక్షణ సంస్థ నోటీసులు పంపింది. ఈ సంస్థలు తమ యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు వేర్వేరు రేట్లు వసూలు చేయడంపై ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో దీనిపై ఉబర్ ఇప్పుడు తన స్పందనను తెలిపింది.
అయితే తమపై వచ్చిన ఆరోపణలను ఉబర్ పూర్తిగా తోసిపుచ్చింది. తాము వినియోగదారుల ఫోన్ మోడల్స్ ఆధారంగా ధరలను నిర్ణయించమని, దీనిపై ఉన్న అపార్థాలను తొలగించడానికి సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉబర్ తెలిపింది.
ఓలా, ఉబర్ సంస్థలపై ఆరోపణలు:ఓలా, ఉబర్ సంస్థలు యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అంటే యాపిల్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఈ కంపెనీలు వేర్వేరు రేట్లు వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన CCPA ఓలా, ఉబర్‌లకు విడివిడిగా నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్ విధానంపై వివరణ ఇవ్వాలని ఈ సంస్థలను ఆదేశించింది.
ఈ మేరకు ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా తెలిపారు. యాపిల్, ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా వేర్వేరు ధరలను వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై ప్రధాన క్యాబ్ అగ్రిగేటర్లు ఓలా, ఉబర్‌లకు CCPA ద్వారా నోటీసులు అందాయని పేర్కొన్నారు. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని ఆయన అన్నారు. ఈ మేరకు దీనిపై రెండు కంపెనీలు పూర్తి వివరణ ఇవ్వాలని CCPA ఆదేశించినట్లు వెల్లడించారు.