Things To Do Before Selling Phone Or Laptop :నేటి టెక్నాలజీ యుగంలో ఎప్పటికపుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను సొంతం చేసుకోవాలనుకుంటున్నారు యువత. అలా కొనేటప్పుడు పాత డివైజ్‌లను అమ్మేయడం, పాడైన వాటిని పారేయడం చేస్తూ ఉంటారు. మన పాత మొబైల్స్, కంప్యూటర్లలో చాలా సమాచారం ఉంటుంది. ఆ డాటా మొత్తాన్ని క్లీన్ చేయకుండా అమ్మేస్తే, మన సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లి, మనం చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆర్టికల్‌లో పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్‌లు అమ్మేసే ముందు చేయాల్సిన 10 కీలకమైన పనులు గురించి తెలుసుకుందాం.
- డేటా బ్యాక్-అప్
మీరు మీ మొబైల్, కంప్యూటర్లను అమ్మేసే ముందు అందులోని ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ సహా ముఖ్యమైన డేటా మొత్తాన్ని హార్డ్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌ల్లో సేవ్ చేసుకోవాలి. అలాగే క్లౌడ్ సర్వీస్‌ల్లోకి కూడా ఈ డేటాను అప్లోడ్ చేసుకోవాలి. దీని వల్ల మీ విలువైన డేటా భద్రంగా ఉంటుంది. - రిమూవ్ కనెక్టెడ్ అకౌంట్స్
మొబైల్, కంప్యూటర్లలో మన గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయ్యుంటాము. ఆ అకౌంట్లలో మన ఫోటోలు, ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్వర్డ్లు, ఇలా చాలా సున్నితమైన సమాచారం అంతా సేవ్ అయ్యుంటుంది. అందుకే పాత డివైజ్‌లు అమ్మేసే ముందు, వాటిలోని అన్ని అకౌంట్ల నుంచి కచ్చితంగా లాగ్-అవుట్ కావాలి. అంతేకాదు, సదరు డివైజ్‌ల్లోని డేటా మొత్తాన్ని తొలగించాలి. లేకుంటే, ఇతరుల చేతుల్లోకి మీ విలువైన సమాచారం మొత్తం వెళ్లిపోయే ప్రమాదం ఉంది. - ఎన్క్రిప్షన్
చాలా మంది కంప్యూటర్లోని ఫైల్స్ డిలీట్ చేస్తారు. హార్డ్ డ్రైవ్‌ని ఫార్మాట్ చేస్తారు. దీనితో ఇతరులు ఎవ్వరూ తమ డేటాను చూడలేరు అని అనుకుంటారు. కానీ ఇది పొరపాటు. లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించి, ఈ డేటాను తిరిగి రప్పించవచ్చు. అందుకే డేటా-వైపింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి, మీ డివైజ్‌లోని డేటా మొత్తాన్ని తొలగించండి. లేదా డివైజ్‌లోని డేటాను మరెవరూ యాక్సెస్ చేయలేని విధంగా దానిని ఎన్‌క్రిప్ట్ చేయండి. ఒకవేళ మీరు వాడేది నెట్‌వర్క్ అటాచ్డ్ స్టోరేజ్ (NAS) డివైజ్ అయితే, డేటా డిలీట్ చేయడమే కాకుండా, RAID కాన్ఫిగరేషన్‌ను కూడా పూర్తిగా తొలగించాలి. ఇలా చేయడం ద్వారా మీ డేటాను ఇతరులు రికవర్ చేయలేరు. - ఫ్యాక్టరీ రీసెట్
మీ డివైజ్‌లో ఫ్యాక్టరీ రీసెట్ చేసే ముందు దానికి లింక్ చేసి ఉన్న అకౌంట్లన్నిటినీ తీసివేయండి. ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ద్వారా మీ డివైజ్‌లోని సమాచారం మొత్తం డిలీట్ అయిపోతుంది. డివైస్ సెట్టింగ్స్ కూడా రీసెట్ అవుతాయి. మీరు కొత్తగా కొన్నపుడు ఉన్న స్థితికి మీ డివైజ్ చేరుతుంది. - రిమూవ్ హార్డ్ డిస్క్
హార్డ్ డిస్క్ల్లోనే మన డేటా అంతా సేవ్ అయ్యి ఉంటుంది. కనుక మీ కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ లేదా హార్డ్ డ్రైవ్‌లను తీసేయండి. ఇలా చేయడం వల్ల మీ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ మీరు పాత డివైజ్‌ను పడేయాలనుకుంటే, వాటిని ధ్వంసం చేయడమే మంచిది. కాకపోతే లిథియం-అయాన్ బ్యాటరీలు ఉండే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, లిథియం-అయాన్ బ్యాటరీలను ధ్వంసం చేసేటప్పుడు అగ్నిప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే వీటిని ధ్వంసం చేస్తే హానికర వాయువులు వెలువడతాయి. అందుకే ఇలాంటి వాటిని నిపుణుల సమక్షంలో ధ్వంసం చేయాల్సి ఉంటుంది. - హార్డ్ డిస్క్ డిస్ట్రక్షన్
మీ డివైజ్‌లో ఉన్న అత్యంత గోప్యమైన సమాచారం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే, హార్డ్ డిస్క్‌ను ధ్వంసం చేయడమే ఉత్తమం. వాస్తవానికి ప్రొఫెషనల్ డ్రైవ్ డిస్ట్రక్షన్ సర్వీసులు కూడా ఉంటాయి. వాళ్లకు మీ డివైజ్‌ను ఇస్తే, వాళ్లే చాలా జాగ్రత్తగా, ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా మీ హార్డ్ డిస్క్‌ను ధ్వంసం చేస్తారు. - చెక్ హిడెన్ డేటా
స్మార్ట్ డివైజ్‌లు మనకు తెలియకుండానే డేటాను స్టోర్ చేసుకుంటాయి. కనుక ఇలాంటి హిడెన్ డేటాను మనం తొలగించాల్సి ఉంటుంది.
నెట్‌వర్క్ రూటర్లు, ప్రింటర్లు, టీవీలు, కెమెరాలు, స్మార్ట్ ఫ్రిడ్జ్‌లు డేటాను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. కనుక ఇలాంటి పరికరాల్లోని డేటాను పూర్తిగా డిలీట్ చేయాలి. - వేర్వేరుగా పడేయాలి
మీరు పాత డివైజ్‌లను పారేయాలనుకుంటే, ముందుగా అందులోని ర్యామ్, మెమోరీ కార్డు, హార్డ్ డిస్క్, ఎస్డీ కార్డు లాంటి వాటిని విడివిడిగా పడేయాలి. ఇలా చేయడం వల్ల ఇతరులు మన డివైజ్‌లోని పరికరాలను సేకరించలేరు. వాటిని అసెంబుల్ చేసి, డేటాను యాక్సెస్ చేయలేరు. - రిమూవ్ సీరియల్ నంబర్స్
మీ డివైజ్‌లను పారేసేముందు దానిపై ఉంటే సీరియల్ నంబర్లను తొలగించండి. ఎందుకంటే, వీటిని ఉపయోగించి కొందరు వ్యక్తులు వారెంటీ క్లెయిమ్ చేసుకొంటుంటారు. ఇలాంటి మోసాలను అరికట్టాలంటే, కచ్చితంగా మొబైల్‌పై ఉండే సీరియల్ నంబర్లను తొలగించాలి. - అవసరమైన వారికి ఇవ్వచ్చు
మీ పాత డివైజ్‌లో లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి, దాని లైఫ్‌స్పాన్ పెంచి ఉపయోగించుకోవచ్చు. లేదా రీసైక్లింగ్ కేంద్రాలకు వాటిని ఇవ్వవచ్చు. దీని వల్ల పర్యావరణానికి హానికలిగించే ఈ-వేస్టేజ్ తగ్గుతుంది. లేదా పాఠశాలలు లేదా HAM రేడియో క్లబ్‌లను సంప్రదించి వారికి ఈ డివైజ్‌లను ఇవ్వండి. వారు వీటిని సద్వినియోగం చేస్తారు.