Tabs Screen Preferences : ట్యాబ్లెట్స్ కొనేవాళ్లు తప్పకుండా చూసే అంశం 'సైజు'. ఎలాంటి సైజులో ట్యాబ్‌ను కొనాలో అర్థంకాక చాలామంది సతమతం అవుతుంటారు. ఆ గందరగోళాన్ని పక్కనపెట్టి, అవసరాలు తీర్చే, సౌకర్యవంతంగా ఉండే ట్యాబ్లెట్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. అయితే ఈక్రమంలో కొన్ని అంశాలను తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
అవసరాన్ని తీర్చేలా డిజైన్, సైజు
ట్యాబ్లెట్స్‌ను ఒక్కొక్కరు ఒక్కో అవసరం కోసం కొంటుంటారు. కొందరు సినిమాలు చూడటానికి, మరికొందరు గేమ్స్ ఆడటానికి వాడుతారు. కొంతమంది జాబ్ వర్క్స్ చేయడానికి కూడా ట్యాబ్లెట్స్‌ను కొంటారు. అవసరాలు తీర్చగలిగే కన్ఫిగరేషన్లు, ఫీచర్లు కలిగిన ట్యాబ్‌ను ఎంచుకుంటే బెటర్. చాలావరకు ట్యాబ్‌ల మోడళ్లు 7 ఇంచుల నుంచి 13 ఇంచుల దాకా సైజుల్లో లభిస్తుంటాయి. ఒక్కో మోడల్ డిజైన్ ఒక్కో రకమైన అవసరాన్ని తీర్చేలా ఉంటుంది.
చిన్న సైజు ట్యాబ్ అయితే
ఒకచోటు నుంచి మరోచోటుకు తిరిగే వారికి కాస్త చిన్న సైజు ట్యాబ్ బెటర్. వీటి సైజు 7 నుంచి 8 ఇంచులు ఉంటుంది. చిన్న సైజు ట్యాబ్‌లు కాస్త తక్కువ రేటులోనే లభిస్తాయి. ఈ-బుక్స్, మేగజైన్స్, ఆర్టికల్స్ రీడింగ్ కోసం ఇవి అనువుగా ఉంటాయి. అయితే వాటి స్క్రీన్ అంత పెద్దగా ఉండదు. మూవీస్, డ్రాయింగ్, మల్టీ టాస్కింగ్‌కు ఇది అంతగా పనికి రాదు. టైపింగ్ కోసం దీని కీబోర్డులో తగిన స్పేస్ ఉండదు. ఒకేసారి రెండు, మూడుకు మించి యాప్స్‌ను వినియోగించే అవకాశం ఉండకపోవచ్చు.
మీడియం సైజు ట్యాబ్ ఉపయోగాలు
టాస్క్‌లు పూర్తి చేయడానికి, ఫైల్స్‌ను బ్రౌజ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉండాలంటే మీడియం సైజు ట్యాబ్‌ను తీసుకోవాలి. వీటి సైజు 9 నుంచి 11 ఇంచులు ఉంటుంది. సినిమాలు చూడటానికి, క్రియేటివ్ వర్క్ చేయడానికి ఇవి కంఫర్ట్‌గా ఉంటాయి. చిన్న సైజు ట్యాబ్‌లతో పోలిస్తే వీటి ధర ఎక్కువే ఉంటుంది. మనం క్రియేటివ్ వర్క్‌ను ప్రో లెవల్‌లో చేయలేకపోవడం మైనస్ పాయింట్. ఎందుకంటే చాలా అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఇవి సపోర్ట్ చేయవు. బేసిక్ లెవల్ క్రియేటివ్ వర్క్స్‌ను దీని ద్వారా చేయగలం. కుటుంబ సభ్యులు కలిసి వాడుకోవడానికి ఈ తరహా ట్యాబ్స్ బెస్ట్.