Samsung Galaxy Z Flip FE: మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ మొబైల్స్‌కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ వీటిపై ఫోకస్ చేసింది. తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా వచ్చే ఏడాది మరో కొత్త ఫోల్డ్ మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.
శాంసంగ్ కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో తన గెలాక్సీ Z ఫ్లిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లో మరింత సరసమైన వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని 'శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ FE' (ఫ్యాన్ ఎడిషన్) పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీని రీలీజ్ డేట్ తెలియనప్పటికీ శాంసంగ్ నెక్ట్స్ ఫోల్డబుల్మొబైల్స్.. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 లతో పాటుగా వచ్చే ఏడాది మధ్యలో తీసుకురావచ్చని తెలుస్తోంది.
కొన్ని వారాల క్రితం శాంసంగ్ ఎంపిక చేసిన మార్కెట్లో దాని టాప్ ఆఫ్ ది లైన్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ఆవిష్కరించింది. అయితే ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే చాలా ఎక్కువ ధరను కలిగి ఉంది. దీంతో ఇప్పుడు బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ సరసమైన వేరియంట్‌ను తీసుకురావలని యోచిస్తోందని దక్షిణ కొరియా బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Naver (ఆండ్రాయిడ్ అథారిటీ ద్వారా)పై ఒక పోస్ట్‌లో టిప్‌స్టర్ తెలిపింది.