Samsung Galaxy S25 Slim: మరో రెండు రోజుల్లో శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను లాంఛ్ చేయనుంది. 'శాంసంగ్ గెలాక్సీ S25' పేరుతో ఈ సిరీస్‌ను తీసుకురానుంది. ప్రతి ఏడాది జనవరి నెలలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల కోసం తన అత్యంత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్ కొత్త సిరీస్ అంటే గెలాక్సీ 'S' సిరీస్‌ను విడుదల చేస్తుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్లో తీసుకొచ్చే స్మార్ట్‌ఫోన్ మోడల్స్, వాటిలోని ఫీచర్ల వివరాలను తెలుసుకునేందుకు శాంసంగ్ లవర్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర స్మార్ట్‌ఫోన్ వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే మార్కెట్లో గెలాక్సీ ఈ 'S' సిరీస్ ప్రత్యక్ష పోటీ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ లేటెస్ట్ సిరీస్‌తో ఉంటుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది జరగబోయే ఈవెంట్‌ను 'గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025' పేరుతో నిర్వహిస్తుంచనున్నారు. ఈసారి శాంసంగ్ తన కొత్త 'S' సిరీస్ అంటే 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్‌ను జనవరి 22ని లాంఛ్ చేయాలని నిర్ణయించింది. ఈ ఈవెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది.
అయితే ఈసారి కంపెనీ తన కొత్త 'S' సిరీస్‌లో కొత్త మోడల్‌ను కూడా తీసుకురాబోతుంది. ఈ మోడల్‌ను 'శాంసంగ్ గెలాక్సీ S25 స్లిమ్' అనే పేరుతో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా దీనిపై నెట్టింట చర్చలు సాగుతున్నాయి. అయితే కంపెనీ దీనిపై ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం అందించలేదు.
కానీ 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్ లాంఛ్ డేట్ దగ్గరపడుతున్న వేళ ఇప్పుడు దీనిపై ఓ లీక్ వచ్చింది. దీని ప్రకారం 'శాంసంగ్ గెలాక్సీ S25 స్లిమ్' ధర 'శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్', 'శాంసంగ్ గెలాక్సీ S25 అల్ట్రా' మోడల్ మధ్య ఉండొచ్చు. ఈ నేపథ్యంలో శాంసంగ్ సిరీస్, దానితో వచ్చే కొత్త మోడల్ గురించి మరిన్ని వివరాలు మీకోసం.
శాంసంగ్ గెలాక్సీ S25 స్లిమ్ మోడల్‌పై లీక్ అయిన వివరాలు: శాంసంగ్ తన 'గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025' ఈవెంట్లో కొత్త 'S' సిరీస్‌తో పాటు మరికొన్ని డివైజ్‌లు లేదా సర్వీసులను కూడా ప్రారంభించొచ్చు. కంపెనీ ఈ అప్‌కమింగ్ 'S' సిరీస్‌లో మూడు ట్రెడిషనల్ మోడల్స్ అంటే 'శాంసంగ్ గెలాక్సీ S25', 'గెలాక్సీ S25 ప్లస్', 'గెలాక్సీ S25 అల్ట్రా'తో పాటు 'గెలాక్సీ S25 స్లిమ్' పేరుతో కొత్త మోడల్‌ను కూడా రిలీజ్ చేయొచ్చు.
అయితే స్మార్ట్‌ఫోన్ గురించి సమాచారం అందించే టిప్‌స్టర్ ఇవాన్ బ్లాస్ 'గెలాక్సీ S25 స్లిమ్' మోడల్ అమెరికాలో సేల్ చేయొకపోవచ్చని ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే శాంసంగ్ ఈ సిరీస్‌లోని మిగిలిన ఫోన్‌లు అమెరికాలో అందుబాటులో ఉంటాయని, కానీ ఈ సిరీస్‌లోని కొత్త మోడల్ యుఎస్‌లో అమ్మకానికి అందుబాటులో ఉండకపోవచ్చని అన్నారు. అయితే దీనిపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన అందుబాలోకి రాలేదు.
ఒకవేళ ఇదే జరిగితే అందులో ఆశ్చర్యపోవడానికి ఏంలేదు. ఎందుకంటే ఇదేం మొదటిసారి కాదు. శాంసంగ్ ఇంతకు ముందు కూడా ఇలా చేసింది. గతేడాది అక్టోబర్‌లో శాంసంగ్ 'గెలాక్సీ Z ఫోల్డ్ 6' స్పెషల్ ఎడిషన్‌ను దాని స్వదేశీ మార్కెట్‌లో అంటే దక్షిణ కొరియాలో మాత్రమే విడుదల చేసింది.