Samsung Galaxy S25 Edge:దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ జనవరి 22న తన 'గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025' ఈవెంట్ నిర్వహించింది. ఈ ప్రోగ్రాంలో కంపెనీ గెలాక్సీ 25 సిరీస్‌ను లాంఛ్ చేసింది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ మోడల్ S-సిరీస్‌లో భాగంగా ఈ లైనప్‌లో 'గెలాక్సీ S25', 'గెలాక్సీ S25+', 'గెలాక్సీ S25 అల్ట్రా' అనే మూడు మోడల్స్‌ను తీసుకొచ్చింది.
కంపెనీ ఈ మూడు స్మార్ట్ఫోన్లతో పాటు మరో మోడల్‌ను కూడా ఈ ఈవెంట్‌లో ప్రవేశపెట్టింది. గత కొన్ని నెలలుగా 'శాంసంగ్ గెలాక్సీ S25' సిరీస్‌తో పాటు 'గెలాక్సీ S25 స్లిమ్' పేరుతో స్పెషల్ ఎడిషన్ కూడా వస్తుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే కంపెనీ మాత్రం ఈ ఈవెంట్‌లో తన 9 ఏళ్ల లైనప్‌ను తిరిగి ప్రవేశపెట్టింది. శాంసంగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్' పేరుతో కొత్త ఫోన్‌ను టీజ్ చేసింది.
గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో కొత్త ఫోన్ టీజర్: శాంసంగ్ తన 'గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025' ఈవెంట్‌లో 'గెలాక్సీ S25 ఎడ్జ్' స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ టీజర్ ద్వారా కంపెనీ తన 'గెలాక్సీ ఎడ్జ్' సిరీస్‌ను 9 సంవత్సరాల తర్వాత తిరిగి మార్కెట్లోకి రాబోతున్నట్లు వెల్లడించింది. 'గెలాక్సీ ఎస్25 ఎడ్జ్' ఈ ఏడాదిలోనే లాంఛ్ చేయనున్నట్లు కన్ఫార్మ్ చేసింది. అంటే కంపెనీ ఈ ఫోన్‌ను 2025 సెకండ్ క్వార్టర్లో జరిగే MWC 2025 ఈవెంట్‌లో లేదా జులైలో జరిగే వార్షిక ఈవెంట్‌లో లాంఛ్ చేయొచ్చు.
శాంసంగ్ రిలీజ్ చేసిన టీజర్లో ఈ అప్‌కమింగ్ 'గెలాక్సీ S25 ఎడ్జ్' వెనక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని కన్ఫార్మ్ చేసింది. ఈ ఫోన్లోని డ్యూయల్ కెమెరా సెటప్‌కు సరిపోయేలా కంపెనీ ఓవల్ ఆకారపు కెమెరా మాడ్యూల్‌ను అందిస్తుంది. GSMAreana నివేదిక ప్రకారం ఈ ఫోన్ ఫ్లాట్ AMOLED డిస్ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది సెంటర్డ్ పంచ్-హోల్ కటౌట్‌తో వస్తుంది.