OPEN AI x Account Hacked:'చాట్ జీపీటీ' సృష్టికర్త ఓపెన్ ఏఐ సంస్థ ప్రస్తుతం హ్యాకర్ల బారిన చిక్కి నానా తంటాలు పడుతోంది. తాజాగా ఆ సంస్థకు చెందిన @OpenAINewsroom అనే ఎక్స్ ఖాతా నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి క్రిప్టో కరెన్సీ కోసం ఓ ప్రకటన పోస్టు చేశారు. క్రిప్టో టోకెన్లు ఓపెన్ ఏఐకి చెందినవని పేర్కొన్నాడు. సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో ఈ పోస్ట్ రాగా, దాన్ని తమ సంస్థ గుర్తించి అప్రమత్తమైందని ఓపెన్ ఏఐ సంస్థ తాజాగా ప్రకటించింది. అంతేకాకుండా దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఆ పోస్ట్‌లు న్యూయార్క్ సహా కొన్నిచోట్ల మాత్రమే కనిపిస్తున్నట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా, సోమవారం ఉదయం ఈ అంశం మీడియాలో రావడానికంటే ముందే, కంపెనీకి చెందిన భద్రతా విభాగ సిబ్బంది తమ ఉద్యోగులకు ఓ అంతర్గత మెమోను పంపారు. అందులో తమ ఉద్యోగుల ఖాతాల హ్యాకింగ్ గురించి ప్రస్తావించి, వారు అప్రమత్తంగా ఉండేందుకు తగు జాగ్రత్తలు సూచించారు.
ఇదే మొదటిసారి కాదు!
అయితే ఇలా ఓపెన్ ఏఐ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి తప్పుడు క్రిప్టో కరెన్సీల పోస్టులు రావడం ఇదేం తొలిసారి కాదు. ఆదివారం ఆ సంస్థ కీలక ఉద్యోగి జేసన్ వీ ఖాతా నుంచి కూడా ఇలాంటి క్రిప్టో పోస్టులు వెలువడినట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా ఈ ఏడాది జూన్‌లోనూ ఓపెన్ ఏఐ చీఫ్ సైంటిస్ట్ జాకబ్ పచోకీ అకౌంట్ కూడా హ్యాకింగ్ బారిన పడింది. ఈయనతో పాటు గతేడాది జూన్‌లో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మారియా మురాటీస్ ఖాతాను కూడా తాత్కాలికంగా గుర్తుతెలియని వ్యక్తులు వాడినట్లు సమాచారం.