Ola Electric Store Expansion:ప్రముఖ విద్యుత్ టూ-వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన రిటైల్ స్టోర్లను అమాంతం పెంచేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఒకేరోజు 3,200 స్టోర్లను భారీ స్థాయిలో ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 800 స్టోర్ల సంఖ్యను ఒకేసారి ఏకంగా 4 వేలకు పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా సోమవారం ఓ ప్రకటన చేశారు.
"ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు సంబంధించి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఉన్న 800 ఓలా ఎలక్ట్రిక్ రిటైల్ స్టోర్లను 4000 సంఖ్యకు పెంచాలని నిర్ణయించాం. మా కస్టమర్లకు మరింత చేరువకావడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా 3,200 స్టోర్లను ఒకేసారి ప్రారంభించనున్నాం. బహుశా ఈ స్థాయిలో స్టోర్ల సంఖ్యను ఒకేసారి ప్రారంభించడం ఇదే ఫస్ట్‌టైం." - భవీశ్ అగర్వాల్, ఓలా ఎలక్ట్రిక్ సీఈవో
విద్యుత్ వాహన విభాగంలో మార్కెట్ నంబర్ వన్‌గా ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌పై ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సేల్స్ అనంతరం కస్టమర్లకు సేవలను అందించే విషయంలో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ వినియోగదారులు హెల్ప్‌లైన్‌కు 10 వేలకు పైనే ఫిర్యాదులు రావడం, దీనిపై సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) విచారణకు ఆదేశించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఈ పరిణామాల మధ్య కంపెనీ నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. అంతేకాక ఆయా స్టోర్లలో ఓలాఎలక్ట్రిక్ సర్వీసులూ లభిస్తాయని కూడా తెలిపింది. తన స్టోర్ల సంఖ్యను పెంచుతున్న నేపథ్యంలో ఓలా చేసిన ఈ ప్రకటన అనంతరం కంపెనీ షేర్లు రాణించాయి. సోమవారం ఉదయం నష్టాల్లో ట్రేడవగా.. 1.40 గంటలకు దాదాపు 5 శాతం లాభంతో ఓలా షేర్లు రూ.91.67 వద్ద ట్రేడవుతున్నాయి.