Neuralink Implant Human :నాడీ సంబంధిత వ్యాధిగ్రస్తులు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై కమ్యూనికేషన్ సామర్థ్యం కోల్పోయిన వ్యక్తులు సాధారణ జీవనం గడిపే రోజులు దగ్గరిలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. అధునాతన కార్ల తయారీ సహా నాసాను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన రాకెట్ల తయారీతో ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వ్యాపార దిగ్గజం ఎలాన్‌మస్క్ డ్రీమ్ ప్రాజెక్టు న్యూరాలింక్‌లో కీలక ముందడుగు పడింది. న్యూరాలింక్ శాస్త్రవేత్తలు మెదడుకు అనుసంధానించే చిప్‌ను విజయవంతంగా మనిషిపై ప్రయోగించినట్లు మస్క్ స్వయంగా వెల్లడించారు.
గతంలో స్విస్ వైద్యులు సైకిల్ యాక్సిటెండ్‌లో పక్షవాతానికి గురైన గెర్ట్‌జాన్ ఓస్కామ్ అనే వ్యక్తిని మళ్లీ నడిపించేందుకు ఆయన మెదడులో చిప్ ఇంప్లాంట్ చేశారు. న్యూరో సైంటిస్ట్‌లు దెబ్బతిన్న అతడి మెదడు, వెన్నెముక మధ్య వైర్‌లెస్ కనెక్షన్‌ను ఏర్పాటుచేశారు. మెదడు సంకేతాలను ఏఐ అల్గారిథమ్ ద్వారా అన్వయించి వెన్నుముకకు పంపేలా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ వ్యక్తి 12 ఏళ్ల తర్వాత తిరిగి నడవగలిగాడు. ప్రమాదాల కారణంగా పూర్తిగా మాట పడిపోయిన వ్యక్తులూ తమ భావాలను ఈ చిప్ సాయంతో పంచుకోగలరు. మెదడు ఆలోచనలు, చిప్ ద్వారా వైర్‌లెస్‌గా కంప్యూటర్లు, ఫోన్లకు అందుతాయి. కొన్ని ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్లు ఆ భావాలను డీకోడ్ చేసి అక్షరాల రూపంలో మనకు స్క్రీన్‌పై కనిపించేలా చేస్తాయి.