Asthma Risk Factors In Children : ఔషధ చికిత్సలో యాంటీ బయాటిక్స్ శక్తిమంతమైన అస్త్రాలుగా ఉపయోగపడుతాయి. చిన్నారులకు వీటిని అవసరం లేకున్నా వినియోగిస్తే... 'ఉబ్బసం (ఆస్తమా)' బారినపడతారని వైద్యనిపుణలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో ఎక్కువగా యాంటీ బయాటిక్స్ ఉపయోగిస్తే ఉబ్బసం ముప్పు ఎందుకు పెరుగుతుంది? దాని ప్రభావం భవిష్యత్ జీవితంపై ఎలా ఉంటుందనే విషయాన్ని ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిల్లలకు యాంటీ బయాటిక్స్ ఇవ్వడం వల్లే కలిగే ఇబ్బందులపై ఆస్ట్రేలియాకు చెందిన 'మోనాష్ యూనివర్సిటీ' పరిశోధకులు ఎలుకలపై రీసెర్చ్ చేశారు. ఆ పరిశోధన వివరాలు తాజాగా 'టీబీసీ జర్నల్'లో ప్రచురితమైయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.60 కోట్ల మంది ఆస్తమాతో ఇబ్బందిపడుతున్నారని, ఈ వ్యాధితో ఏటా 4.55 లక్షల మంది చనిపోతున్నారని టీబీసీ జర్నల్ తెలిపింది. ఈ నేపథ్యంలో పిల్లల్లో ఉబ్బసం రావడానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిలోఫర్ ఆసుపత్రి సీనియర్ పీడియాట్రీషియన్ ప్రొఫెసర్ తోట ఉషారాణి ఈటీవీ భారత్‌కు కీలక విషయాలు వెల్లడించారు.
యాంటీ బయాటిక్స్ ఎఫెక్ట్స్ : ఐదేళ్లలోపు పిల్లల్లో వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90% కారణం వైరస్‌లే అని డాక్టర్ ఉషారాణి తెలిపారు. వీటి కారణంగా మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి, నాలుగైదు రోజులకు దానంతటదే తగ్గిపోతుందని వెల్లడించారు. కాకపోతే కొందరు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతారని, అవగాహన లేని కొందరు వైద్యులు కూడా చిన్నారులకు యాంటీ బయాటిక్స్‌ను సూచిస్తుంటారని ఆమె పేర్కొన్నారు. ఇలా వాడితే వాటికి నిరోధకత ఏర్పడటం ద్వారా పిల్లలకు భవిష్యత్‌లో నిజంగా అవసరమైన సమయంలో యాంటీ బయాటిక్స్ పనిచేయవన్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు టైఫాయిడ్‌కు బాగా పనిచేసిన సిప్రోఫ్లోక్సాసిన్ మందు ఇప్పుడు ప్రభావం చూపడం లేదని తెలిపారు.
12 ఏళ్లలోపు పిల్లల్లో 7.9% ముప్పు : పిల్లలకు చిన్న వయసులోనే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ కీలక దశలో తల్లిపాలు పట్టడంతోపాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిచాల్సి ఉంటుంది. తద్వారా పిల్లల ఎదుగుదలకు, రోగ నిరోధకశక్తి చక్కగా పనిచేయడానికి ఈ బ్యాక్టీరియా తొడ్పడుతుంది. అయితే, యాంటీబయాటిక్స్ అధికంగా వాడితే పేగుల్లోని మంచి బ్యాక్టీరియకు కూడా నష్టం జరుగుతుంది. రోగ నిరోధక శక్తిపై ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆస్తమా ముప్పు పెరుగుతుందని తెలుస్తోంది. ఒక అధ్యయనం ప్రకారం... ఇండియాలో 12 ఏళ్లలోపు పిల్లల్లోని 7.9% మందిలో ఆస్తమా కనిపిస్తోందని వెల్లడైంది. పిల్లలు, పెద్దలు కలుపుకొని.. ప్రపంచవ్యాప్తంగా ఆస్తమా కారణంగా సంభవించే మరణాల్లో సుమారు 46% భారత్ నుంచే నమోదవుతున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. NLM కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. (National Librabry of Medicine రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).
పిల్లికూతలు-డొక్కల ఎగరవేత : ఆస్తమా ముందుగా దగ్గుతో వస్తుంది. పిల్లి కూతలు కనిపిస్తుంటాయి. పిల్లలు డొక్కలు ఎగరేస్తారు. ఆయాసం పెరుగుతుంటుంది. ఆహారం తీసుకోరు. పిల్లలు అదేపనిగా ఏడుస్తుంటారు. ఉబ్బసం పెరిగితే ఆక్సిజన్ అందక.. జీవన్మరణ సమస్య కూడా ఎదురవుతుందని డాక్టర్ ఉషారాణి తెలిపారు.
తల్లి పాలే అత్యంత సురక్షితం : శిశువు పుట్టిన తొలి ఆర్నెల్లపాటు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని డాక్టర్ ఉషారాణి సూచిస్తున్నారు. ఆ తర్వాత రెండేళ్ల వరకు ఇతర ఆహారంతోపాటు తల్లి పాలను ఇస్తే ఆస్తమా బారినపడకుండా రక్షణ లభిస్తుందని ఆమె తెలిపారు. సీసా పాలతో పెరిగిన పిల్లలు, తక్కువ బరువుతో, నెలలు నిండకముందే పుట్టిన వారు, సిజేరియన్‌తో జన్మించిన పిల్లలకు ఉబ్బసం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్లు పలు పరిశోధనల్లో తెలిలింది. అందుకే వైద్యులు యాంటిబయాటిక్స్ రాస్తే వాటి వాడకంపై పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా ప్రశ్నించాలని ఆమె సూచిస్తున్నారు.
కాలుష్యం కూడా ప్రధాన కారణాలు
- మితిమీరిన పట్టణీకరణ
- ఎగ్జిమా, దద్దుర్లు, టాన్సిల్స్, ఇన్‌ఫెక్షన్లు
- వాయు కాలుష్యం, గాలిలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెరగడం
- జన్యుపర సమస్యలు
- ఇంట్లో బయటా దుమ్మూధూళీ బారినపడడం
పరిశ్రమల నుంచి వచ్చే పొగ, అగర్‌బత్తీలు, దోమల నివారణ కాయిల్స్ నుంచి వచ్చే పొగ, సిగరెట్లు తాగేవారు వదిలిన పొగ కూడా పిల్లల ఆరోగ్యంపై పడుతుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ఇన్‌హేలర్లతో తక్షణ ఉపశమనం : ఆస్తమాకు ఇన్‌హేలర్లను వాడితే పిల్లలకు అలవాటై పోతాయనే అపోహ కొందరు తల్లిదండ్రుల్లో ఉందని డాక్టర్ ఉషారాణి అంటున్నారు. అందుకని సిరప్‌లు ఇవ్వాలని అడుగుతుంటారని తెలిపారు. కానీ వాటికంటే ఇన్‌హేలర్లే ఎక్కువ రక్షణ ఇస్తాయని ఆమె పేర్కొన్నారు. మందును సిరప్ రూపంలో మిల్లీగ్రాము డోసుల్లో ఇస్తారని, ఇన్‌హేలర్లలో మైక్రోగ్రామ్ డోసుల్లో ఇస్తారని ఆమె వెల్లడించారు. ఒక మైక్రోగ్రామ్ అంటే, ఒక మిల్లీగ్రామ్ డోసులో 1000 రెట్లు తక్కువ డోసు. ఇన్‌హేలర్ ద్వారా ఇచ్చే ఔషధం నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుంది. తద్వారా వేగంగా ఉపశమనం కలుగుతుందని వెల్లడించారు.
ఇన్‌హేలర్లను రెండు రకాలుగా వాడాల్సి ఉంటుందని డాక్టర్ ఉషారాణి తెలిపారు. కొన్నింటిని ఎప్పుడు దగ్గు, ఆయాసం వస్తే అప్పుడు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. మరికొన్నింటిని దీర్ఘకాలం వాడాలని వెల్లడించారు. వీటిని సీజనల్‌గా జూన్, జులైలలో ప్రారంభించి చలికాలం మొత్తం వాడితే, ఆస్తమా నుంచి పిల్లలను రక్షించుకోవచ్చని స్పష్టం చేశారు. నివారణ కోసం మందులు వాడే పిల్లల్లో చాలామందికి వయసు పెరుగుతున్న కొద్దీ ఆస్తమా ముప్పు కూడా తగ్గిపోతుందని వెల్లడించారు. నివారణ మందులు వాడని పిల్లల్లో శ్వాసనాళాలు మందంగా మారడం ద్వారా పెద్దవాళ్లలో వచ్చే ఆస్తమా మాదిరిగా ఉండిపోతుందని హెచ్చరించారు. అందుకే వైద్యులు ఎంతకాలం ఇన్‌హేలర్లను వాడమంటే, అంతకాలమే వాడాలని తెలిపారు. శీతల వాతావరణం, చల్లటి, ఉబ్బసం కారక పదార్థాలకు దూరంగా ఉంచాలని డాక్టర్ ఉషారాణి వెల్లడించారు. ఆస్తమా బాధిత పిల్లలకు న్యుమోనియా, ఫ్లూ టీకాలు ఇప్పించడంతో పాటుగా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.