President Droupadi Murmu To Visit Hyderabad : ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయని న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేథను మరింత ఉపయోగించుకొని బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ధనికుడితో పోలిస్తే పేదవాడు న్యాయం పొందడంలేదని మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలని రాష్ట్రపతి అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ న్యాయబద్ధంగా సత్యాగ్రహ దీక్ష చేసి, ఆదర్శంగా నిలిచారని ముర్ము అన్నారు.
స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి : నిబద్ధత, పారదర్శకంగా పనిచేస్తే న్యాయవాద వృత్తిలో ఎంతో ఎత్తుకు ఎదగొచ్చని ముర్ము తెలిపారు. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన 21 స్నాతకోత్సవంలో ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్ స్వాగతం పలికారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు : నేరుగా నల్సార్ విశ్వవిద్యాలయానికి చేరుకున్న రాష్ట్రపతికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే స్వాగతం పలికారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ, ఎల్ఎల్ఎంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందించారు.
రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ : ఈరోజు సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్-2024 కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు. నేటి నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు ఈ మహోత్సవాలు జరగనున్నాయి. ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న కళా మహోత్సవాలను సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. రాష్ట్రపతితో పాటు పది మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలు అద్దం పట్టేలా రాష్ట్రపతి సమక్షంలో కళాకారులు నృత్య, కళారూపాలు ప్రదర్శించనున్నారు.
"ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. న్యాయ వ్యవస్థ కూడా కృత్రిమ మేథను ఉపయోగించుకోవాలి. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలి. మెరుగైన సమాజం కోసం ఈ విధానంలో మార్పు రావాలి".-ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి
హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము - గవర్నర్, సీఎం ఘన స్వాగతం