Meta Verified For WhatsApp Business : ఇండియాలోని వాట్సాప్ బిజినెస్ యూజర్ల కోసం మెటా వెరిఫైడ్ ప్రోగ్రామ్‌ను తీసుకువచ్చింది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంది. వాస్తవానికి గతేడాది సెప్టెంబర్‌లోనే వాట్సాప్ బిజినెస్ యాప్ వాడేవారి కోసం మెటా వెరిఫైడ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. తాజాగా ఇండియా సహా బ్రెజిల్, ఇండోనేషియా, కొలంబియా దేశాల్లో వెరిఫైడ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.
గ్రీన్ టిక్
వాట్సాప్అకౌంట్కు ఎదురుగా గ్రీన్ టిక్ రావాలంటే మెటా వెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవాలి. అప్పుడు కంపెనీ మీ ఖాతాను వెరిఫై చేసి, వెరిఫికేషన్ బ్యాడ్జ్ (గ్రీన్ టిక్) అందిస్తుంది. అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మాదిరిగానే యూజర్లు తమ వాట్సాప్ బిజినెస్ ఖాతాకు మెటా వెరిఫైడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా సబ్స్క్రిప్షన్ తీసుకున్నవాళ్లకు మాత్రమే గ్రీన్ టిక్ ఇస్తారు.
బెనిఫిట్స్ ఏమిటి?
మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్ పొందిన ఖాతాలకు గ్రీన్‌టిక్ ఉంటుంది. దీని వల్ల మీ ఒరిజినాలిటీ యూజర్లకు తెలుస్తుంది. అలాగే మీ బిజినెస్ నేమ్‌తో మరొకరు నకిలీ ఖాతా తెరవకుండా రక్షణ లభిస్తుంది. మీ మార్కెటింగ్ అవసరాల కోసం వాట్సాప్ ఛానల్‌ను కూడా మెటా - క్రియేట్ చేసి ఇస్తుంది.
వాట్సాప్ బిజినెస్ వెరిఫైడ్ ప్రోగ్రామ్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లు వివిధ డివైజ్‌ల నుంచి లాగిన్ కావడానికి వీలవుతుంది. దీనితోపాటు మీ కస్టమర్లకు, వెండర్లకు కనిపించేలా, మీ బిజినెస్ వివరాలతో కూడిన కస్టమ్ వెబ్‌పేజీ కూడా క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.