Meta Facial Recognition Feature:ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీతో ఆన్లైన్ మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. గత కొంతకాలంగా సెలెబ్రెటీల ఫేసెస్ను యాడ్ చేస్తూ ఏఐ సహాయంతో వస్తున్న యాడ్స్ పెరిగిపోయాయి. దీంతో ఈ స్కామ్స్ బారిన పడిన వారు మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి మోసాలు అరికట్టడంపై మెటా దృష్టి పెట్టింది. ఇందుకోసం 'ఫేషియల్ రికగ్నైజేషన్' ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
ఫేక్ అని రుజువైతే ఆటోమేటిక్‌గా బ్లాక్: ఈ ఫీచర్ ఫేక్ యాడ్స్‌ను గుర్తించడంలో సహాయపడుతుంది. ఏదైనా యాడ్‌లో సెలబ్రిటీల ఫొటోస్ ఉపయోగించినా, మోసం జరిగినట్లు అనుమానం వచ్చినా అది ఫేషియల్ రికగ్నైజేషన్ను ఉపయోగిస్తుందని మెటా తెలిపింది. ఫేస్ మ్యాచ్ అయి అది ఫేక్ యాడ్ అని రుజువైతే ఆటోమేటిక్‌గా దాన్ని బ్లాక్ చేసేస్తుంది.
మెటా గతంలో ఫోటో ట్యాగింగ్ కోసం ఇదే టెక్నాలజీని ఉపయోగించింది. కానీ 2021లో ప్రైవసీ, రెగ్యులేటర్ పుష్బ్యాక్ నేపథ్యంలో ఫేస్‌బుక్‌లోని ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాల దృష్ట్యా మళ్లీ మూడేళ్ల తర్వాత ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేషియల్ రికగ్నైజేషన్ ఫీచర్‌ను తిరిగి తీసుకురావాలని మెటా నిర్ణయించింది.
అందుబాటులోకి ఎప్పుడు?:ఈ ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ మొదట ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సెలబ్రిటీలకు అందుబాటులో ఉండనుంది. సెలబ్రిటీలు ఫేక్ యాడ్స్ నుంచి ప్రొటెక్ట్ కోసం ఈ టూల్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ ఫీచర్ మరింతమందికి అందుబాటులో రానుందని మెటా వైస్ ప్రెసిడెంట్ మోనికా బికర్ట్ తెలిపారు.