ISRO Launches Indias First Analog Space Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం లద్దాఖ్‌లోని లేహ్‌లో ఇండియా మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ISRO హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ నేతృత్వంలోని ఈ మిషన్‌ను AAKA స్పేస్ స్టూడియో, లద్దాఖ్ యూనివర్సిటీ, IIT బాంబే భాగస్వామ్యంతో డెవలప్ చేశారు. దీనికి లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కూడా తన సహాయాన్ని అందించింది. ఈ మేరకు అనలాగ్ స్పేస్ మిషన్ వివరాలను ఇస్రో తన సామాజిక మాధ్యమం X లో పోస్ట్ ద్వారా పంచుకుంది.
"ఇండియా మొట్టమొదటి అనలాగ్ స్పేస్ మిషన్ లేహ్‌లో ప్రారంభమైంది. ఇది హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఇస్రో, ఆకా స్పేస్ స్టూడియో, ది యూనివర్శిటీ ఆఫ్ లద్దాఖ్, ఐఐటీ బాంబే, లద్దాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో కలిసి చేసిన ప్రయత్నం." - ఇస్రో
చంద్రుడు, అంగారకగ్రహం లాంటి కఠిన భౌగోళిక పరిస్థితులున్న పరిసరాలలో వ్యోమగాములు నివాసం ఉండటానికి తగిన ఏర్పాట్లను అభివృద్ధి చేసేందుకు ఈ మిషన్ ఉపయోగపడనుంది. లద్దాఖ్ పొడి వాతావరణం, ఎత్తైన ప్రదేశం, బంజర్ భూభాగం మార్స్, మూన్ పరిస్థితులను పోలి ఉంటాయి. దీంతో అనలాగ్ పరిశోధనకు ఇది అనువైన ప్రదేశమని పరిశోధకులు భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ మిషన్ ప్రారంభించేందుకు లద్దాఖ్‌లోని లేహ్ వేదికైంది.
అసలేంటీ అనలాగ్ మిషన్?:
నాసా తెలిపిన వివరాల ప్రకారం..అత్యంత తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో అంతరిక్ష యాత్రకు సంబంధించి చేపట్టే ఫీల్డ్ టెస్టులనే అనలాగ్ మిషన్స్గా పిలుస్తారు. దీనిలో ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసి తమ స్పేస్ ట్రావెల్ ప్రిపరేషన్‌పై అనలైజ్ చేస్తాయి. సాధారణంగా కొత్త టెక్నాలజీలు, రోబోటిక్ డివైజస్, ప్రత్యేకమైన వాహనాలు, కమ్యూనికేషన్లు, ఎలక్ట్రిసిటీ జనరేషన్ వంటి పలు అంశాలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తారని నాసా పేర్కొంది.
అంతరిక్ష యాత్రలను చేపట్టే సంస్థలు, స్పేస్‌ఏజెన్సీలు ముందుగా అత్యంత కీలకమైన ఈ అనలాగ్ మిషన్లను చేపడతాయి. ఆ తర్వాతే వీటికి భిన్నమైన వాతావరణాలు, భౌగోళిక ప్రదేశాలు వ్యోమగాములకు అవసరం అవుతాయి. త్వరలో భారత్ గగన్‌యాన్ ప్రాజెక్టు చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తన కీలకమైన అనలాగ్ మిషన్‌ను ప్రారంభించింది.
ఈ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి తీసుకెళ్లే వనరులను ఎలా వాడుకోవాలో శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తారు. వ్యోమగాములపై నిర్మానుష్య ప్రదేశంలోని ఒంటరితనం ప్రభావాన్ని అంచనా వేయనున్నారు. భవిష్యత్తులో మూన్, మార్స్ పైకి మానవ సహిత యాత్రలకు ఇది ప్రయోజనకరంగా మారనుంది.
జూపిటర్ చంద్రుడిపై జీవం ఉందా..?- నిగూఢ రహస్యాలు ఛేదించేందుకు రంగంలోకి 'యూరోపా క్లిప్పర్'
సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్ లాంచ్- ఐఎస్ఎస్కు బయల్దేరిన స్పేస్ఎక్స్ రాకెట్ - SpaceX Crew 9 Mission Launch