IPhone Prices Slashed :ఐఫోన్ లవర్స్ అందరికీ గుడ్‌న్యూస్. యాపిల్ (Apple) కంపెనీ భారత్‌లో ఐఫోన్ ధరలను తగ్గించింది. కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్‌లో కస్టమ్ డ్యూటీని తగ్గించడమే ఇందుకు కారణం.
యాపిల్ నిర్ణయంతో ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ ధరలు ఏకంగా 3-4 శాతం వరకు తగ్గాయి. ముఖ్యంగా ఐఫోన్ ప్రో మోడల్ ధర రూ.5,100 వరకు; ఐఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ.6 వేలు వరకు తగ్గింది. దేశీయంగా తయారయ్యే ఐఫోన్ 13, 14, 15 మోడళ్ల ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. ఐఫోన్ ఎస్‌ఈ ధర రూ.2300 వరకు తగ్గింది.
కారణం అదే!
సాధారణంగా యాపిల్ కంపెనీ కొత్త మోడళ్లు లాంఛ్ చేసినప్పుడు మాత్రమే పాత మోడళ్ల ధరలను తగ్గిస్తూ ఉంటుంది. కానీ తొలిసారి సాధారణ పరిస్థితుల్లోనూ యాపిల్ కంపెనీ ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్ల ధరలను తగ్గించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 బడ్జెట్‌లో మొబైల్ ఫోన్లపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడమే ఇందుకు కారణం.
కస్టమ్స్ డ్యూటీ
సాధారణంగా దిగుమతి చేసుకునే స్మార్ట్‌ఫోన్లకు 20 శాతం కస్టమ్స్ డ్యూటీ, 2 శాతం సర్‌ఛార్జీ (22 శాతం) వర్తిస్తుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీ కూడా చెల్లించాలి. అందువల్లనే మొబైల్ ఫోన్ల ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇప్పుడు కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు కనుక బేసిక్ కస్టమ్ డ్యూటీ 15 శాతం, సర్‌ఛార్జీ 1.5 శాతం కలిపి 16.5 శాతానికి చేరింది. అయితే ఇప్పుడు కూడా 18 శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.