Instagram Introduces Song On Profile Feature :ఇన్‌స్టాగ్రామ్ డైహార్డ్ ఫాన్స్‌కు గుడ్ న్యూస్. ఇన్‌స్టాగ్రామ్ మీ కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ప్రొఫైల్ కస్టమైజేషన్‌ను మరింత మెరుగుపర్చడంలో భాగంగా 'ప్రొఫైల్ సాంగ్' (Insta Profile Song) ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్‌కు ప్రత్యేకంగా తమకు నచ్చిన పాటను పెట్టుకోవచ్చు. మూడ్‌కు అనుగుణంగా దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం కొన్ని లైసెన్స్‌డ్ సాంగ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులో ఉంచింది. దీని కోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని సబ్రీనా కార్పెంటర్‌తో ఒప్పందం కూడా చేసుకుంది.
Instagram Profile Song Feature :యూజర్ బయో కింద ప్రొఫైల్ సాంగ్ ఫీచర్ కనిపిస్తుంది. మీరు మ్యూజిక్ ఐకాన్‌ను ట్యాప్ చేస్తేనే పాట ప్లే అవుతుంది. అయితే యూజర్లు కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న పాటను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. యూజర్లు మార్పు చేసే వరకు ప్రొఫైల్‌లో ఆ సాంగ్ మాత్రమే ఉంటుంది. అంటే స్టేటస్/ స్టోరీస్ తరహాలో 24 గంటల్లో అది మాయం అవ్వదు.
ప్రొఫైల్ సాంగ్‌ను ఎలా యాడ్ చేయాలంటే?
- ముందుగా మీరు ఇన్‌స్టా ప్రొఫైల్ ట్యాబ్‌లోకి వెళ్లి 'ఎడిట్ ప్రొఫైల్'ను ఎంచుకోవాలి.
- 'యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్'పై క్లిక్ చేయాలి.
- మీకు నచ్చిన పాటలో - క్లిప్ నిడివిని ఎంచుకోవాలి.
- ఒక పాటలో గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఎంచుకుని, దానిని ప్రొఫైల్ సాంగ్‌గా పెట్టుకోవచ్చు. అంతే సింపుల్!