How To Control Cell Phone Usage :పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు చేతిలోనే ఉండే పరికరం ఏది అంటే అది మొబైల్ ఫోన్ అని ఠక్కున చెప్పొచ్చు. ఫోన్ చేతిలో ఉంటే చాలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు చాలా మంది. అయితే విచ్చలవిడిగా ఫోన్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ వాడకాన్ని తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఈ ఇప్పుడు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్ రోజులో కొన్ని గంటలపాటు పక్కన పెట్టేందుకు ప్రయత్నించండి. మీ వ్యక్తిగత సెల్ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి క్వాలిటీ టైమ్, మూమెంట్ వంటి యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్స్‌కు నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఫోన్‌కు ఎక్కువగా అడిక్ట్ అవ్వకుండా ఉండేందుకు ఇతర విషయాలు( మీ హాబీస్)పై దృష్టి పెట్టండి. దీంతో మీరు కాస్త బిజీగా ఉండి సెల్ ను కాసేపు పక్కనపెడతారు.
1. మీ ఫోన్ వాడకం సమయాన్ని తగ్గించండి
మీరు రోజూ ఫోన్‌ను ఎంత సేపు వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత సెల్ ఫోన్ వాడకం సమయాన్ని రోజురోజుకు మెల్లగా తగ్గించుకోండి. క్వాలిటీ టైమ్, మూమెంట్ వంటి యాప్స్‌ను ఉపయోగించి రోజుకు మీరు ఎంత సేపు సెల్ ఫోన్‌ను యూజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు.
2. నోటిఫికేషన్స్‌ను ఆఫ్ చేయండి
మీ ఫోన్లోని యాప్స్‌కు నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. లేదంటే నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి మొబైల్‌ను చూస్తుంటారు. దీంతో పోన్ వాడకం మరింత ఎక్కువైపోతుంది. యాప్స్ ఇన్స్టాల్ చేసినప్పుడే నోటిఫికేషన్లను ఆఫ్ చేసేయండి.
3. ఫోన్లో అలారం పెట్టొద్దు
ఫోన్లో అలారం పెట్టడం వల్ల ఉదయం లేవగానే సోషల్ మీడియా యాప్స్ వంటివి చూస్తూ ఉండిపోతారు. దీంతో ఫోన్ వినియోగం వేకువజామున నుంచే మొదలైపోతుంది. అందుకే అలారం వేరే పరికరంలో పెట్టుకోండి. దాదాపుగా మీ బెడ్ రూమ్‌లో ఫోన్ పెట్టడం మానేయడం మంచిది. ఎందుకంటే సెల్ ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే కాంతి మీకు నిద్రాభంగాన్ని కూడా కలిగించవచ్చు.
4. మెసేజ్‌లకు రిప్లై కోసం టైమ్ పెట్టుకోండి.
అలాగే ఫేస్ బుక్, వాట్సాప్ సహా కొన్ని సోషల్ మీడియా యాప్స్, ఉద్యోగ సంబంధ ఈ- మెయిల్ మెసేజ్‌లకు రిప్లై ఇవ్వడానికి రోజులో ఏదో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. లేదంటే రోజంతా ఫోన్లో వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఫోన్ వినియోగం మరింత పెరిగిపోయింది. ముఖ్యమైన మెసేజ్‌లు అయితే మాత్రం వెంటనే రిప్లై ఇవ్వాల్సి ఉండొచ్చు.
5. ప్రతి రోజు కొంత సమయం ఫోన్‌ను ఆఫ్ చేయండి
ప్రతి రోజు కొన్ని గంటలపాటు మీ ఫోన్‌ను ఆఫ్ చేయండి. మధ్యాహ్నం నిద్రపోయే ముందు, భోజనం చేసేటప్పుడు ఇలాంటి సమయాల్లో ఫోన్ ఆఫ్‌లో ఉంచండి. ఈ టిప్ కూడా మీ ఫోన్ వినియోగాన్ని కొంత మేర తగ్గిస్తుంది.
6. ఫోన్‌కు ఛార్జింగ్ ఇలా పెట్టండి!
మీకు దూరంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. లేదంటే మీ పక్కనే ఫోన్‌కు ఛార్జింగ్ పెడితే మాటిమాటికీ తీసి దాన్ని వాడుతుంటారు. లేదంటే ఛార్జ్ చేస్తూనే ఫోన్ వాడేస్తుంటారు చాలా మంది. అందుకే ఫోన్ వినియోగం తగ్గాలంటే మీరు ఈ ట్రిక్‌ను పాటించండి.