How Cold Is Moon Surface :అందనంత దూరంలో అందాల చందమామ. తెల్లగా మిలమిల మెరిసే జాబిల్లి చుట్టూ అల్లుకున్న కథలు, అంతులేని రహస్యాలెన్నో! 21వ శతాబ్దంలో వేగంగా పురోగతి చెందుతున్న సాంకేతికత ఇప్పుడిప్పుడే చందమామ గుట్టు విప్పుతోంది. రాత్రిళ్లు చల్లని వెన్నెల కురిపించే చందమామపై ఎంత చలిగా ఉంటుంది? ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి పరిస్థితి ఉంటుందనే ప్రశ్నలకు సైన్స్ చెప్పిన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వేగంగా మారే టెంపరేచర్
చంద్రుడిని చూస్తే చాలా మందికి చలిగా ఉండే ఒక బండరాయిలా కనిపిస్తుంది! చందమామపై ఎంత చలి ఉంటుంది, ఉష్ణోగ్రతల ఎలా ఉంటాయనే సందేహం మనలో చాలా మందికి కలిగే ఉంటుంది. భూమి లాగే చంద్రుడిపై ఉష్ణోగ్రతలు కూడా సూర్యకాంతి ఎక్కడ పడుతుంది అనే దానిబట్టి మారుతూ ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత చాలా వేగంగా మారుతుందని, అధిక చలి నుంచి ఒక్కసారిగా చాలా వేడిగా అయిపోతుందని మిషిగాన్ విశ్వవిద్యాలంలో ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ జాన్ మోనియర్ తెలిపారు.
చంద్రుడిపై ఉండే ఉష్ణోగ్రత
చంద్రుడిపై ఉష్ణోగ్రత మైనస్ 100 డిగ్రీ సెల్సియస్ నుంచి దాదాపు 100 డిగ్రీ సెల్సియస్ రేంజ్లో ఉండే అవకాశం ఉందని తెలిపారు జాన్ మోనియర్. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకారం భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత 15 సెల్సియస్ ఉంటుంది. రేంజ్ పరంగా చూస్తే- ఇది దాదాపు మైనస్ 89 డిగ్రీ సెల్సియస్ నుంచి 57 సెల్సియస్ వరకు ఉంటుంది.
చంద్రుడి, భూమి మధ్య ఎందుకంత తేడా?
"సూర్యుడికి భూమి, చందమామ దాదాపు సమాన దూరంలో(దాదాపు 150 మిలియన్ కిలోమీటర్లు) ఉంటాయి. కానీ ఉష్ణోగ్రతలలో మాత్రం తేడా ఉంది. దీన్ని కొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. భూమి విషయం తీసుకుంటే- దీనికి ఒక వాతావరణం ఉంటుంది. ఇది వేడిని గ్రహించి నివాసయోగ్యమైన ఉష్ణోగ్రతలను కల్పిస్తుంది. కానీ చంద్రుడికి భూమిలా వాతావరణం లేదు. దీంతో సూర్యకాంతి నేరుగా చంద్రుడి ఉపరితలంపై పడుతుంది." అని ప్రొఫెసర్ జాన్ మోనియర్ వెల్లడించారు.
అంతేకాకుండా భూమిపై మహాసముద్రాలు ఉన్నాయి. ఇవి సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహిస్తాయి. అనంతరం రాత్రి వేళల్లో వేడిని విడుదల చేస్తాయి. కానీ చంద్రుడిపై అలా జరగదు. రాత్రిళ్లు చంద్రుడిపై వేడిని విడుదల చేయడానికి కుదరదు. అందుకే రాత్రి అక్కడ చాలా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. లూనార్ డే-నైట్ సైకిల్, భూమిపై దాదాపు ఒక నెల రోజులతో సమానం. అందుకే చంద్రుడి ఉపరితలంపై సుదీర్ఘ సమయం ఎండ, చీకటి ఉంటుంది.
చంద్రుడిపై ఉండే మట్టిని రెగోలిత్ అని అంటారు. ఇది చాలా మంచి ఇన్సులేటర్. అందుకే చంద్రుడి ఉపరితలం పగలు, రాత్రి - వేడి, చలిని నిలుపుకుటుంది. అపోలో 15, 17 మిషన్ల సమయంలో చందమామ ఉపరితలం కింది ఉష్ణోగ్రత కొలతలను తీసుకున్నారు. ఉపరితలం నుంచి 14 అంగుళాల (35 సెంటీమీటర్లు) దిగువన ఉన్న సగటు ఉష్ణోగ్రత, ఉపరితలం కంటే 40-45 కెల్విన్‌లు వెచ్చగా ఉందని తేలింది.
నాసా ప్రకారం, చంద్రుడి ఈక్వేటర్ వద్ద పగలు ఉష్ణోగ్రత 121 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అదే రాత్రి సమయంలో మైనస్ 133 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతుంది. బుధగ్రహం తర్వాత, చంద్రుని ఉపరితలం సౌర వ్యవస్థలోనే అత్యంత తీవ్రమైన ఉష్ణ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.
చంద్రుడి ధ్రువాల వద్ద సూర్యుడు ఉదయించడు. కాబట్టి ఇక్కడ ఎప్పుడూ 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండదు. శాశ్వత చీకటిలో కొన్ని బిలాల్లో మంచు కణాలు ఉండే అవకాశం ఉందని, ఇది చంద్రుడిపై మానవ మనుగడకు కీలక కావచ్చని ప్రొఫెసర్ మోనియర్ చెప్పారు.
చంద్రుడిపై ఉండే ఉష్ణోగ్రతలను 2009 జూన్‌లో ప్రయోగించిన లూనార్ రికనైసెన్స్ ఆర్బిటర్ (LRO)తో NASA కొలిచింది. ఈ LRO ఆర్బిటర్ అందులో ఉన్న థర్మల్ కెమెరా, డివైనర్ లూనార్ రేడియో మీటర్ ఎక్స్‌పెరిమెంట్‌ను ఉపయోగించి కొన్ని నీడ ఉన్న గుంత లాంటి ప్రాంతాలను గుర్తించింది. అందులో 17 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నట్లు కనుగొంది. ఈ గుంతలు మానవ ఆశ్రయానికి అనుకూలమైన ప్రదేశాలుగా ఉపయోగపడే అవకాశం ఉన్నట్లు పరిశోధనలు సూచిస్తున్నాయి.
అయితే, నీడ ప్రాంతాల్లో ఉన్న కొన్ని గుంతల్లో అత్యంత శీతల ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉన్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. సౌర వ్యవస్థలోనే అత్యంత తక్కువ ఉష్ణోగ్రత కూడా ఉండొచ్చని చెబుతున్నారు. అయితే ఆ గుంతల వద్దకు సూర్య కాంతి అసలే రాదు. అంతేకాకుండా మిగతా ప్రాంతాలపై పడి రిఫ్లెక్ట్ అయిన కాంతి కూడా ఆ గుంతల దగ్గరికి చేరదు. ఈ గుంతల్లో ఉండే ఉష్ణోగ్రత డైరెక్ట్‌గా ఇప్పటివరకు కొలవలేదు. కానీ మైనస్ 248 డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే శీతలంగా ఉండే అవకాశం ఉంది.
'అది అర్థం చేసుకోవడం ముఖ్యం'
చంద్రుని ఉష్ణోగ్రతలు ఎలా హెచ్చుతగ్గులకు గురవుతాయో అర్థం చేసుకోవడం భవిష్యత్ అన్వేషణకు చాలా కీలకం. అయితే మానవులు చంద్రుడిపై ఎక్కువ కాలం ఉండాలని అనుకుంటున్నప్పుడు, అక్కడి ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను తట్టుకోగల పరికరాలను నిర్మించాల్సి ఉంటుందని అని ప్రొఫెసర్ మోనియర్ అన్నారు. అంతేకాకుండా ఇన్సులేటింగ్ రెగోలిత్- వివిధ పరికరాలు వేడెక్కకుండా ఉండటానికి వాటితో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో అని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని చెప్పారు. "మనం చంద్రునిపై శాశ్వత స్థిరనివాసం కలిగి ఉండాలనుకుంటే లేదా ఒక బేస్ లాగా లేదా శాస్త్రీయ పరికరాలతో కూడిన ల్యాబ్ ఏర్పాటు చేయాలనుకుంటే, ఉష్ణోగ్రత ఎలా మారుతుందో తెలుసుకోవాలి. తద్వారా చంద్రుడిపై శాశ్వతంగా ఉండే వస్తువులను తయారు చేయవచ్చు" అని ప్రొఫెసర్ మోనియర్ చెప్పారు.