PM E-Drive Scheme: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 'పీఎం ఇ-డ్రైవ్' పేరుతో తీసుకొచ్చిన ఈ పథకానికి రూ. 10,900 కోట్ల ($1.3 బిలియన్) మేర కేటాయించింది. ఈ పథకం రెండు సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటీ పీఎం ఇ-డ్రైవ్ పథకం? దీనివల్ల ఎవరికి లాభం? ఈ పథకం ఏ వాహనాలకు వర్తిస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.
పీఎం ఇ-డ్రైవ్ పథకం అంటే?:పీఎం ఇ-డ్రైవ్ అంటే పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఆన్ ఇన్నొవేటివ్ వెహికిల్ ఎన్‌హాన్స్‌మెంట్. ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం దీని ప్రధాన లక్ష్యం.
వివిధ రకాల ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ: కేంద్రం ఎలక్ట్రిక్ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, అంబులెన్స్‌లు, ట్రక్స్, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీల కింద రూ. 3, 679 కోట్లు ($36.79 బిలియన్లు) కేటాయించింది. మొత్తంగా 28 లక్షల వాహనాల కొనుగోలుదారులకు ప్రయోజనం లభిస్తుంది. ఇందులో 24.79 లక్షల టూ- వీలర్స్, 3.16 లక్షల త్రీ వీలర్ వాహనాలు, 14,028 బస్సులు ఉన్నాయి.
ఇ- అంబులెన్స్ ఏర్పాటుకు రూ. 500 కోట్లు, ఇ- ట్రక్స్ ప్రోత్సాహకానికి రూ. 500 కోట్లు, 14,028 ఇ- బస్సుల సేకరణకు రూ. 4391 కోట్లు అందిస్తారు. విద్యుత్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రూ. 2 వేల కోట్ల వరకు కేటాయించింది.