Google Pay Payment Issues :ప్రస్తుత కాలంలో హవా అంతా డిజిటల్ పేమెంట్లదే. 'టీ' నుంచి మెుదలుకొని 'కారు' కొనడం వరకు ఆన్లైన్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే వీటి చెల్లింపులు చేసే సమయంలో కొన్ని కొన్ని సార్లు ఈ యూపీఐలు సరిగ్గా పనిచేయవు. దాంతో కస్టమర్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎప్పుడైనా గూగుల్ పేలో చెల్లింపులు చేసే సమయంలో మీరు సమస్యలు ఎదుర్కొన్నారా? ఏం ఇబ్బంది పడకండి. కింది మూడు మార్గాలను పాటించి ఈ ఆన్లైన్ పేమెంట్లో కలిగే ఇబ్బందులను అరికట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం పదండి.
1. ఇంటర్నెట్ కనెక్ట్ సరి చూసుకోండి
కొన్ని సార్లు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసినప్పటికీ పేమెంట్ చెయ్యలేము. ఆ సమయంలో మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉందా లేదో చూసుకోండి. సాధారణంగా ఇంటర్నెట్ కనెక్ట్ కానప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంటుంది.
2. సర్వర్ బిజీ
సర్వర్ బిజీ అనేది తరచుగా కస్టమర్లు ఎదుర్కొనే సమస్య. ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా ఉన్నప్పటికీ ఈ సమస్య ఎదుర్కొంటారు కస్టమర్లు. అలాంటి సందర్భంలో మీ యూపీఐకి ఇతర బ్యాంకు ఖాతాలు లింక్ చేసి ఉంటే వాటితో చెల్లింపులు చేయండి.
3. క్రెడిట్ కాకపోవటం
పై వాటిలా కాకుండా ఈ సమస్య అప్పుడప్పుడు ఎదురవుతుంది. కొన్ని సార్లు మన ఖాతా నుంచి డబ్బు డెబిట్ అవుతుంది కానీ అవతలి వారికి చేరదు. దీంతో వినియోగదారులు ఒక్కసారిగా కంగారు పడుతుంటారు. అయితే ఇటువంటి సందర్భాల్లో గూగుల్ పే కొన్ని సెకన్లలలోనే డబ్బును మీ ఖాతాకు రీఫండ్ చేస్తుంది. లేని సందర్భాల్లో 48 గంటల్లో డబ్బులు తప్పనిసరిగా మీ అకౌంట్లోకి చేరుతాయి. ఒకవేళ అలా జరగని పక్షంలో ఆ లావాదేవికి సంబంధించిన టికెట్ జనరేట్ చేయాల్సి ఉంటుంది.
ఈ విధంగా టికెట్ జనరేట్ చేయండి
గూగుల్ పేలోని ట్రాన్సాక్షన్ హిస్టరీకి వెళ్లండి. తర్వాత ఇష్యూస్ అనే ఆప్షన్ను క్లిక్ చేయండి. అనంతరం గూగుల్ పే ప్రతినిధి మీ సమస్యపై టికెట్ జనరేట్ చేస్తారు. అంతేకాకుండా 1800-419-0157 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి మీ సమస్యని పరిష్కరించుకోవచ్చు.
కొన్నికొన్ని సార్లు వినియోగదారులు పొరపాటున వేరే అకౌంట్లోకి డబ్బును పంపిస్తారు. అటువంటి వాటికి గూగుల్ పే బాధ్యత వహించదు. మనమే సదరు ఖాతాదారున్ని తిరిగి ఆ డబ్బుని పంపమని అభ్యర్థించాలి తప్ప సంస్థ నుంచి ఎటువంటి సహకారం అందదు. అందుకే ఎవరికైనా డబ్బు పంపేటప్పుడు జాగ్రత్తగా గమనించాక చెల్లింపులు చేయాలి.