Google Android New Features AI :సాధారణంగా మొబైల్‌ను చేతితో ఆపరేట్ చేస్తుంటాం. గేమ్స్, చాటింగ్, కాల్స్ ఇలా ఏవి చేయాలన్నా చేతితోనే చేస్తాం. అయితే ఇక నుంచి ఆ అవసరం లేదు. ముఖ కవళికల ద్వారా ఫోన్‌ను ఆపరేట్ చేయొచ్చు. అలాగే గేమ్స్ సైతం ఆడుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ టెక్నాలజీ వస్తే మొబైల్ వాడేటప్పుడు చేతినే ఉపయోగించక్కర్లేదు. మరెందుకు ఆలస్యం ఈ గూగుల్ ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం.
ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ అనే ఫీచర్‌ను మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఫీచర్ ముఖ కవళికలు, తల, పెదాలు, కళ్లు వంటి వాటితో సంజ్ఞలు చేస్తే పనిచేస్తుంది. 'ఫోన్ కెమెరా ద్వారా ఈ ఏఐ టెక్నాలజీ ముఖ, తల కదలికలను ట్రాక్ చేస్తుంది. ఆ తర్వాత ఆ కవళికలను అనువదిస్తుంది. ప్లేఎబిలిటీ వంటి కంపెనీలు తమ సమగ్ర సాఫ్ట్‌వేర్‌లో ప్రాజెక్ట్ గేమ్ ఫేస్‌ను ఉపయోగించడాన్ని చూసి సంతోషిస్తున్నాం. త్వరలో ఆండ్రాయిడ్ వెర్షన్లో గేమ్ ఫేస్ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నాం' అని ఓ ప్రకటనలో గూగుల్ పేర్కొంది.