Google I/O 2025:గూగుల్ తన అతిపెద్ద వార్షిక ఈవెంట్లలో ఒకటైన Google I/O డెవలపర్ కాన్ఫరెన్స్ 2025 తేదీని ప్రకటించింది. కంపెనీ తన ఈ పెద్ద ఈవెంట్‌ను మే 20 2025న నిర్వహించనుంది. ఇది 21 మే 2025 వరకు కొనసాగుతుంది. అంటే ఈ కార్యక్రమం 2 రోజుల పాటు కొనసాగుతుంది. దీంతో ఈ అతిపెద్ద ఈవెంట్‌లో గూగుల్ ఏ కొత్త టెక్నాలజీ ఆవిష్కరణలు తీసుకువస్తుందో తెలుసుకునేందుకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'గూగుల్ I/O 2025' ఈవెంట్ డేట్, టైమింగ్ అండ్ లొకేషన్:గూగుల్ ఈ స్పెషల్ ఈవెంట్‌ను USAలోని కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న షోర్‌లైన్ యాంఫీథియేటర్‌లో నిర్వహించనుంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ప్రత్యేక ప్రసంగంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో కంపెనీ సాధించిన విజయాలు, కొన్ని కొత్త ప్లాన్‌ల గురించి సమాచారం అందించనున్నారు. ఈ ఈవెంట్ మే 20న భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. గూగుల్ ఈ ప్రోగ్రాం రెండు రోజుల్లో డెవలపర్ ప్రొడక్ట్స్ మెయిన్ హైలైట్స్‌ను ప్రసారం చేయనున్నట్లు తన బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది.
కంపెనీ గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ ఈవెంట్‌లో ఏఐ ఫీచర్లకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వొచ్చు. తన AI చాట్‌బాట్ జెమినిలో అనేక కొత్త ఫీచర్లు, అప్గ్రేడ్లు, పురోగతిని తీసుకువచ్చే అవకాశం ఉంది. అంతేకాక గూగుల్ ఈ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కొత్త AI-పవర్డ్ టూల్స్‌ను కూడా ప్రకటించొచ్చు లేదా ప్రారంభించొచ్చు.
ఇంకా ఈ ఈవెంట్‌లో ఏం జరగొచ్చంటే?: పైన తెలిపిన వాటితో పాటు గూగుల్ ఈ ఈవెంట్‌లో ఆపరేటింగ్ సిస్టమ్ కొత్త వెర్షన్ అంటే 'Android 16'ని కూడా రిలీజ్ చేయొచ్చు లేదా దానిపై సమాచారాన్ని కూడా అందించే అవకాశం ఉంది. దీంతోపాటు 'Wear OS 6'ని కూడా రిలీజ్ చేయొచ్చు. ఇవేకాక Google Maps, Gemini AI యాప్స్, Google Workspaceతో సహా అనేక ఇతర యాప్‌ల కొత్త ఫీచర్‌లను పరిచయం చేయొచ్చు.
ఇదిలా ఉండగా గూగుల్ ఇటీవలే తన కొత్త 'ఆండ్రాయిడ్ XR' ఆపరేటింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. ఇది సాధారణ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది కాదు. ఇది నెక్ట్స్ జనరేషన్ కంప్యూటింగ్ కోసం రూపొందించిన పూర్తిగా కొత్త ఓఎస్. దీన్ని AI, AR, VR హెడ్‌సెట్స్, స్మార్ట్ గ్లాసెస్ కోసం రూపొందిస్తున్నారు. ప్రధానంగా ఇందులో గూగుల్ 'జెమినీ AI' పనిచేస్తుంది.