తెలంగాణ

telangana

ETV Bharat / technology

భవిష్యత్ అంతా AI మయం- ఏ ప్రొడక్ట్‌ అయినా ఆ టెక్నాలజీతో నడవాల్సిందే! - THE FUTURE OF AI

భవిష్యత్‌ ఉత్పత్తులన్నీ ఏఐ టెక్నాలజీతో వచ్చేవే - మరో ఆల్టర్నేటివ్ లేదంటున్న నిపుణులు!

The Future Of AI
The Future Of AI (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

The Future Of AI : ఎలక్ట్రానిక్స్ కంపెనీలు భవిష్యత్తులో విడుదల చేయబోయే ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా 2024లో పలు నగరాల్లో జరిగిన షోల్లో ప్రదర్శించాయి. వాటిలో ట్రాన్స్‌పరెంట్ టీవీ నుంచి కళ్లతో కారును నియంత్రించే యాప్‌ వరకు అన్నీ ఉన్నాయి. మెజారిటీ ఉత్పత్తులు కృత్రిమ మేథ సాయంతోనే పనిచేయనున్నాయి. ఫలితంగా భవిష్యత్తులో ఏ వస్తువు వచ్చినా అందులో కృత్రిమ మేథ సాంకేతికత ఉండనుందని నిపుణులు చెబుతున్నారు.

ఏఐ డివైజెస్‌
అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఈ ఏడాది ఆరంభంలో వినియోగదారుల సాంకేతిక సంఘం (CTA) వార్షిక కన్య్జూమర్ ఎలక్ట్రానిక్స్ షోను నిర్వహించింది. ఇందులో పలు సంస్థలు తాము రూపొందించిన ఉత్పత్తులను ప్రదర్శించాయి. టెక్‌ ప్రపంచంలో సంచలనంగా మారిన కృత్రిమ మేథ (ఏఐ)ను చాలా కంపెనీలు తమ ఉత్పత్తుల్లో జోడించాయి. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఎల్‌జీ భవిష్యత్తు తరం టీవీని ఆవిష్కరించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి వైర్‌లెస్ ట్రాన్స్‌పరెంట్ ఓఎల్‌ఈడీ టీవీకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసింది. 77 అంగుళాల స్క్రీన్‌తో కూడిన ఈ టీవీలో ట్రాన్స్‌పరెంట్ మోడ్‌ వినియోగదారులను ఇట్టే ఆకట్టుకుంటోంది. సాధారణ టీవీల్లా ఇందులో వెనుక వైపున ఏమీ ఉండదు. అంతా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. టీవీని ఆఫ్ చేస్తే అదొక గాజులా కనపడుతుంది. అటు ప్రముఖ సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీ సామ్‌సంగ్ ఫోల్డబుల్ డిస్‌ప్లేలతో కూడిన ఫోన్‌లతో పాటు, కొంత ఎత్తు నుంచి బరువువైన వస్తువు పడినా పగుళ్లు రాకుండా ఉండే డిస్‌ప్లేను రూపొందించింది. ఫోల్డబుల్‌ ఫోన్లను సామ్‌సాంగ్ ఇది వరకే విడుదల చేసినా ఇందులో ఓ ప్రత్యేకత ఉంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా ఫోన్ మడత పెట్టి ఉపయోగించుకునే విధంగా రూపొందించింది.

ఆరోగ్య పరీక్షలకు ఏఐ
పక్షులపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తల కోసం చైనాకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే ఓ పరికరాన్ని రూపొందించింది. ఇందులో ఉండే కెమెరా ఏఐను ఉపయోగించి గార్డెన్‌ లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండే పక్షులు ఏ జాతికి సంబంధించినవో ఫోన్‌కు సందేశం పంపిస్తుంది. దాదాపు 6 వేల పక్షి జాతులను పసిగట్టేలా దీనికి ప్రోగ్రామింగ్ చేశారు. పిల్లి బయట నుంచి ఎలుక లేదా పక్షిని ఇంట్లోకి తీసుకొని రాకుండా అడ్డుకునే పరికరాన్ని స్విట్జర్లాండ్‌కు చెందిన స్టార్టప్ సంస్థ తయారు చేసింది. ఇందులో ఉండే ఇన్‌ఫ్రారెడ్ కెమెరా ఏఐ సాయంతో, పిల్లి ఎలుక లేదా పక్షిని తీసుకొస్తే వెంటనే తలుపు అడ్డుగా వస్తుంది. ఫలితంగా పిల్లి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. న్యూరాలాజిక్స్ కార్పొరేషన్ రూపొందించిన మ్యాజిక్ మిర్రర్ - మనిషి ముఖాన్ని స్కాన్ చేసి ఆరోగ్యాన్ని అంచనా వేస్తుంది. బీపీ, పల్స్‌, శ్వాసతీసుకునే వేగం, ఒత్తిడిని తెలియపరుస్తుంది. భవిష్యత్తులో గుండెపోటు, టైప్‌-2 డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటే ముందే పసిగట్టి హెచ్చరిస్తుంది. ఈ పరికరం ఏఐ సాయంతో పనిచేస్తుందని న్యూరాలాజిక్స్ కార్పొరేషన్ ప్రతినిధులు తెలిపారు. 30 సెకన్ల సెల్ఫీ వీడియో తీసుకొని ఆరోగ్య వివరాలను తెలియజేస్తుందని చెప్పారు.

అచ్చం మనిషిలా రాసే రోబో
అచ్చం మనిషిలాగా రాసే పరికరాన్ని హ్యాండ్‌వ్రిటన్ అనే సంస్థ ప్రదర్శించింది. మనకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తే ఏఐ సాయంతో ఈ పరికరం లేఖపై అచ్చం మనిషిలాగే రాస్తుంది. ఇందుకోసం రోబోటిక్ చేతిని వినియోగిస్తుంది. అటు స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పలు సెల్‌ఫోన్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కళ్లతో కారును నియంత్రించే యాప్‌ను రూపొందించింది. కళ్లతోనే కారు ఇంజిన్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అలాగే ముందుకు, వెనక్కు నడపచ్చు. అయితే ఇది డ్రైవింగ్‌కు ప్రత్యామ్నాయం కాదని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కళ్లతో నియంత్రించే సాంకేతికత ప్రస్తుత ఆరంభ దశలో ఉందని చెప్పారు. ప్రస్తుతం ప్రయోగం అందులో ఒక భాగమని అన్నారు. భవిష్యత్తులో విడుదల చేసే ఫోన్లను మోటోరోలా, లెనోవో కంపెనీలు ఆవిష్కరించాయి.

నెట్‌వర్క్ లేకున్నా ఫోన్ కాల్!
నెట్‌వర్క్ లేని చోట శాటిలైట్ సాయంతో కాల్‌ చేసుకునే ఫోన్‌ను యూఏఈకి చెందిన ఓ కంపెనీ ప్రదర్శించింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకున్నప్పుడు ఈ ఫోన్ ఉపయోగుపడుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. నెట్‌వర్క్‌పై ఆధారపడటం ఇష్టం లేనివారి కోసం ఈ ఫోన్‌ను డిజైన్‌ చేశామని వెల్లడించారు. థింక్‌బుక్ పేరిట ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులోఉన్న ల్యాప్‌టాప్‌లో కొత్త మోడల్‌ను లెనోవో ప్రదర్శించింది. ఈసారి ట్రాన్స్‌పరెంట్ డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్‌ను రూపొందించింది. ఇందులో 17.3 అంగుళాల మైక్రో ఎల్ఈడీ స్క్రీన్‌ ఉంది. ఆరోగ్యం వివరాలను అందించే రింగ్‌ను సామ్‌సంగ్‌ ఆవిష్కరించింది. ఈ గెలాక్సీ రింగ్‌ను వేలుకు పెట్టుకుంటే ఏఐ సాయంతో ఆ వ్యక్తి ఆరోగ్య వివరాలను తెలియజేస్తుంది.

ఏఐ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో
ఈ ఏడాది సెప్టెంబరులో జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగిన ఐఎఫ్‌ఏ కన్జ్యూమర్ ఎలక్ర్టానిక్స్ షో పలు కంపెనీలు హోమ్‌ అప్లయెన్స్‌ను ప్రదర్శించాయి. ఐదు రోజుల పాటు ఆహారాన్ని తాజాగా ఉంచే రిఫ్రిజిరేటర్‌ను మియలే కంపెనీ ప్రదర్శించింది. ఫోన్‌తో నియంత్రించే వాషింగ్ మిషన్‌ను బాష్ ఆవిష్కరించింది. పరిమాణంలో ప్రపంచంలోనే పలుచనైన ఫోల్డబుల్‌ ఫోన్‌ మ్యాజిక్‌ వీ త్రీని హానర్ విడుదల చేసింది. అమెరికాకు చెందిన మెుబైల్ తయారీ దిగ్గజం యాపిల్ సంస్థ ఐఫోన్ సిక్స్‌టీన్ సిరీస్‌ను చేసింది. ఏఐ సాంకేతికత తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ - ఏఐతో వీటిని తీసుకొచ్చింది. కొత్త ఫోన్ల IOS18తో పనిచేస్తాయని తెలిపింది. ఏఐ సేవలు ప్రత్యేకంగా చిప్‌ను అభివృద్ధి చేశామని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details