Elon Musk Plans To Charge New X Users : ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్(ట్విట్టర్) యూజర్లకు ఎలాన్ మస్క్ మరోసారి షాకిచ్చారు. కొత్తగా ఎక్స్(ట్విట్టర్) అకౌంట్ తీసుకునేవారు డబ్బులు చెల్లించాల్సిందేనని ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. కొత్త యూజర్లు ఎక్స్‌లో పోస్ట్ చేయాలన్నా, ట్వీట్లకు లైక్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా, చివరికి బుక్‌మార్క్ చేయాలన్నా ఛార్జ్ వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.
బాట్స్‌ను అడ్డుకోవడానికే!
కొత్త ఎక్స్ వినియోగదారులు నామమాత్రపు వార్షిక రుసుమును చెల్లించాల్సి ఉంటుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. దురదృష్టవశాత్తూ కొత్త యూజర్లు రైటింగ్ యాక్సెస్ కోసం చిన్నమొత్తంలో రుసుము చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. బాట్‌ల దాడిని అరికట్టడానికి ఇదే ఏకైక మార్గమన్నారు. మూడు నెలల తర్వాత కొత్త యూజర్లు ఎక్స్‌లో ఉచితంగా ట్వీట్లు, పోస్ట్‌లు పెట్టగలరని పేర్కొన్నారు.
ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేపట్టారు ఎలాన్ మస్క్. ఇప్పటికే ట్విట్టర్ పేరును ఎక్స్‌గా మార్చారు. ఎక్స్ మాధ్యమంలో సమూల మార్పులకోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కొత్త యూజర్లపై ఛార్జీల భారం వేశారు. అయితే ఈ ఛార్జీల పెంపుపై యూజర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి.