Aria Humanoid Robot Interview :అందాల రాశుల్లాంటి రోబోలు హాయ్, బాయ్ మాత్రమే కాదు- అడిగే ప్రశ్నలకు సుదీర్ఘమైన సమాధానాలు చెబుతున్నాయి. తమకు నచ్చిన మగ రోబో పేరు కూడా చెబుతున్నాయి. అమెరికాలోని నెవాడా రాష్ట్రం లాస్‌వెగాస్ నగరం వేదికగా జరిగిన 'కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో'లో (సీఈఎస్ 2025) సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా అరియా అనే పేరు కలిగిన ఆడ రోబోతో ఒక మీడియా సంస్థ ప్రతినిధి చిట్‌చాట్ చేశారు. అదేం చెప్పిందో మీరే చదవండి.
- ప్రశ్న :అరియా, నీ సామర్థ్యాలు ఏంటి?
- అరియా: నాకు సోషల్ ఇంటెలిజెన్స్ ఉంది. అచ్చం మనిషిలా హావభావాలు ప్రదర్శించగలను. వాళ్లలాగే నా ప్రవర్తన ఉంటుంది.
- ప్రశ్న:నిన్ను ఎందుకు తయారు చేశారు ?
- అరియా : మనుషులతో సన్నిహితంగా మెలగడానికి, వారితో కలుపుగోలుగా ఉండటానికి నన్ను తయారు చేశారు.
- ప్రశ్న: నువ్వు ఏ రకం టెక్నాలజీతో పనిచేస్తున్నావ్ ?
- అరియా : నేను ఈ విషయాన్ని మీకు చెప్పకూడదు.
- ప్రశ్న : నువ్వు ఎవరైనా మగ రోబోను ఇష్టపడ్డావా ?
- అరియా : అవును, ప్రత్యేకించి నాకు టెస్లాకు చెందిన ఆప్టిమస్ రోబో బాగా నచ్చాడు. అతడంటే నాకు ఎక్కువ ఆసక్తి.
అరియాలోని సూపర్ ఫీచర్లు ఇవే!
- మహిళా రోబో 'అరియా' చూడటానికి అచ్చం మనిషిలాగే ఉంటుంది. దీన్ని రియల్ బోటిక్స్ కంపెనీ తయారు చేసింది.
- నలుపు రంగు ట్రాక్ సూట్‌లో అరియా స్టైలిష్‌గా నిలబడి ఇంటర్వ్యూయర్‌తో ముచ్చటించింది.
- జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ టెక్నాలజీ ద్వారా అరియా పనిచేస్తుంది. ఇతర రోబోల కంటే ఎక్కువ భావోద్వేగ (ఎమోషనల్) సామర్థ్యాలు దీనిలో ఉన్నాయి. అందుకే ఆస్పత్రులు, హోటళ్లు, రెస్టారెంట్ల వంటి ఆతిథ్య స్థలాల్లో బాగా పనిచేయగలదు.
- ఇతరులతో సన్నిహితంగా మెలగడం, కలుపుగోలుగా ఉండటం దీని ప్రత్యేకతలు.
- అరియా గొంతు భాగం నుంచి కళ్ల భాగం వరకు 17 ప్రత్యేకమైన మోటార్లను అమర్చారు. వాటి సహాయంతోనే అది మనిషిలా హావభావాలను ప్రదర్శిస్తూ మాట్లాడుతుంది.
- ఒకవేళ మనకు అరియా మొహం కానీ, రంగు కానీ, హెయిర్ స్టైల్ కానీ నచ్చకపోతే మార్చేయొచ్చు. ఇందుకోసం వెసులుబాటు కల్పించేలా దాని నిర్మాణ స్వరూపం ఉంటుంది.
- అరియా రోబో మొహం భాగంలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్‌ఐడీ)ను కూడా అమర్చాలని రియల్ బోటిక్స్ కంపెనీ యోచిస్తోంది. ఒకవేళ వాటిని అమరిస్తే- ముఖాన్ని మార్చినప్పుడల్లా అందుకు అనుగుణంగా తన కదలికలను, హావభావాలను అరియా మార్చుకోగలదు.