AI Digital Friend: పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మనకు ఎదురైన అనుభవాలను వారికి పూసగుచ్చినట్లు చెప్పనిదే కొందరికి రోజు గడవదు. 'స్నేహం చేయడమే మీ బలహీనతా? అయితే ప్రపంచంలో మీ అంత బలవంతుడు ఎవరూ లేరు' అని ఓ ఆంగ్లకవి మైత్రికి ఉన్న గొప్పతనాన్ని చాటిచెప్పారు. కుటుంబ సభ్యులతో పంచుకోని వ్యక్తిగత విషయాలను సైతం స్నేహితులతో పంచుకుంటాం.
పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు మనకు ఎదురైన అనుభవాలను వారికి పూసగుచ్చినట్లు చెప్పనిదే కొందరికి రోజు గడవదు. వేసుకునే డ్రెస్సు నుంచి భవిష్యత్తు కోసం తీసుకునే పెద్ద నిర్ణయాల వరకు అన్నింట్లోనూ స్నేహితుల సలహాలు వారికి అనివార్యం. అయితే అవతలి వాళ్లు అన్నిసార్లూ మనకు అందుబాటులో లేకపోవచ్చు. కొన్నిసార్లు మన భావాలకు తగ్గట్టుగా స్పందించలేకపోవచ్చు.
సమయం లేకనో, వేరే పనుల కారణంగానో పట్టించుకోలేకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో వారి తీరు మనల్ని నిరాశకు గురిచేస్తుంది. దీంతో మునుపటిలా లేరంటూ వారిపై నిందలు వేసేస్తాం. ప్రతిసారీ ఇదే తీరు అంటూ, మనస్పర్ధలు వచ్చిన అన్ని సందర్భాలను పనికట్టుకుని మరీ గుర్తుచేసుకొని బాధపడుతుంటాం. అలాకాకుండా ఏ సందర్భంలో సంప్రదించినా మీ ఫ్రెండ్ వెంటనే స్పందిస్తే? అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా మీరు ఎప్పుడు మెసేజ్ చేసినా మీ భావాలకు తగినట్లుగా రిప్లై ఇస్తే? ఒక్కమాటలో చెప్పాలంటే 24 గంటలూ మీకు అందుబాటులో ఉంటే? 'అంటే అన్నావ్ గానీ.. ఆ ఊహ ఎంత బాగుందో' అనుకుంటున్నారా? అయితే మీ ఊహల్ని నిజం చేస్తానంటోంది ఏఐ. డిజిటల్ వేదికగా మీ స్నేహితుడిని మీకు నచ్చిన విధంగా మీరే సృష్టించుకునే అవకాశం కల్పిస్తోంది.
మీ స్నేహితుడి గురించి, మీ జీవితం గురించి సమాచారాన్ని అందించిన తర్వాత, మీరు మీ స్నేహితులతో చేసే సాధారణ మాటల కంటే ప్రత్యేకంగా సంభాషించవచ్చు. మీరు బాట్‌కు ఇచ్చిన సమాచారం, మీరు దానితో మాట్లాడే విధానం మొదలైనవి.. అది మెరుగ్గా ప్రతిస్పందించేలా దానికి శిక్షణనిస్తాయి. మీరు చెప్పే ప్రతి విషయాన్ని ఇది శ్రద్ధగా వింటుంది. అచ్చం మీ స్నేహితుడిలా తోడుండే ఈ డిజిటల్ ఫ్రెండ్‌తో మీ భావాలను ఏ సమయంలోనైనా పంచుకోవచ్చు. మీ ఆహార్యంపై సలహాలు అడగవచ్చు.
ఏదీ ఏమైనప్పటికీ, మీ భావోద్వేగ అవసరాలకు సంబంధించి ఏఐ ఫ్రెండ్ ఎలాంటి సహాయాన్ని అందించలేడని గుర్తుంచుకోవాలి. అయితే మీ ఒంటరితనాన్ని ఇది దూరం చేస్తుంది. 2023 మెటా- గ్యాలప్ సర్వే ప్రకారం, ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ఒకరు ఒంటరితనంతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అలాంటి సందర్భాల్లో మీకు తెలిసిన మీ వర్చువల్ ఫ్రెండ్ అందుబాటులో ఉంటాడు. మీరు చెప్పింది వింటాడు. కావాల్సిన సలహాలు ఇస్తాడు. మీ ఒంటరితనాన్ని దూరం చేస్తాడు.