Yuva on bhaje vaayu vegam Movie Director Prashanth Reddy :సినిమా ప్రేక్షకులకు వినోద సాధనమైతే అదే సినిమా ఎంతో మంది జీవితాలకు భవిష్యత్తు. అలాంటి జీవితాన్నే కోరుకున్నాడు మెదక్‌కు చెందిన ప్రశాంత్ రెడ్డి. సినీ పరిశ్రమలో రాణించాలనే పట్టుదలతో 12 ఏళ్లు అహర్నిశలు శ్రమించి, దర్శకుడు అవ్వాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు. ప్రముఖ అగ్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌లో అవకాశం సంపాదించుకొని యువ కథానాయకుడు కార్తికేయతో భజే వాయు వేగం అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో ప్రశాంత్ రెడ్డి 12 ఏళ్ల కష్టం ఫలించింది. మెదక్ కుర్రాడి ప్రతిభ ఫిల్మ్ నగర్లో మారుమోగింది.
హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలోనే ఉండటంతో ప్రశాంత్‌ను తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించి చదివిచారు. చదువుకుంటూనే స్నేహితులతో కలిసి సినిమాలు చూడటం అలవాటు చేసుకున్నాడు. అలా మొదలైన సినిమా అభిరుచి ఫిల్మ్ నగర్లో అడుగుపెట్టాలన్న తపనను రేకెత్తించింది. అయితే తన ఊరివాళ్లు కానీ, తనకు తెలిసిన వాళ్లు కానీ సినీ పరిశ్రమలో ఎవరు లేరు. అయినా సరే ప్రశాంత్ తన ప్రయత్నాన్ని వదులుకోలేదు. కెమెరాతో చిన్న చిన్న వీడియోలు తీస్తూ వాటిని తనే స్వయంగా ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తూ ముసిరిపోయేవాడు. అప్పుడు ప్రశాంత్‌కు అర్కుట్లో యువ దర్శకుడు సుజీత్ పరిచయం అయ్యాడు.
యూవీ క్రియేషన్స్‌లో అవకాశం : ఆ పరిచయంతో సుజీత్‌తో కలిసి యూవీ క్రియేషన్స్‌లో అవకాశాన్ని అందుకున్నాడు. సుజీత్ దర్శకత్వం వహించిన రన్ రాజా రన్, సాహో చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. సహాయ దర్శకుడిగా పనిచేసే అవకాశం కంటే ముందే ప్రశాంత్ రెడ్డి తనను తాను తీర్చిదిద్దికున్నాడు. నేపథ్య సంగీతం, ఎడిటింగ్ మీద పట్టు సంపాదించుకొని తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ప్రశాంత్ రెడ్డి పనితీరును మెచ్చిన యూవీ నిర్మాతలతోపాటు దర్శకుడు సుజీత్, రెబల్ స్టార్ ప్రభాస్, శర్వానంద్ లాంటి అగ్ర హీరోల ప్రశంసలందుకున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు తన మనసులోని మాటను సుజీత్‌తో పంచుకున్నాడు.
మంచి కథ తయారు చేశానని, దర్శకుడిగా అవకాశం కోసం ప్రయత్నిస్తానని వివరించాడు. ప్రశాంత్ రాసిన కథ విన్న యూవీ నిర్మాతలు, ఒక్క సిట్టింగ్‌లోనే ఒకే చేశారు. దేవుడు కరుణించినా పూజారి అడ్డుపడ్డొట్లు, కొవిడ్ రూపంలో ప్రశాంత్ సినీ ప్రయాణానికి బ్రేకులు పడ్డాయి. కోవిడ్ కష్టకాలాన్ని ఎదుర్కొంటూనే కథానాయకుడు కార్తీకేయకు తన కథ వినిపించాడు. కార్తికేయ కూడా ప్రశాంత్ కథను మెచ్చి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కట్ చేస్తే ప్రశాంత్ రెడ్డి 12 ఏళ్ల కల నెరవేరింది. సినీ పరిశ్రమలో ఎవరూ చేయని విధంగా అనుకున్న సమయానికంటే మూడు వారాల ముందే ఫస్ట్ కాపీ సిద్ధం చేశాడు. తన బృందంలో చిత్ర విజయం పట్ల ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.