YS Jagan Letter to PM Modi: వందరోజుల పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సున్నితమైన తిరుమల లడ్డూ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఆరోపించారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణల్లో నిజానిజాలు వెలికి తీయాలని ప్రధాని మోదీని కోరారు. ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా చూడకపోతే పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ చేశారన్న సీఎం చంద్రబాబు ఆరోపనలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీకి జగన్ సుదీర్ఘ లేఖ రాశారు.
ప్రజల దృష్టిని మరల్చడానికి పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారని, దీంట్లో భాగంగానే తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారని ఆరోపణలు చేశారని తెలిపారు. రాజకీయ ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రచారం చేశారన్నారు. నెయ్యిని ఆలయానికి పంపే ముందు దాని స్వచ్ఛత, నాణ్యతలపై నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్, కాలిబ్రేషన్ ల్యాబరేటరీస్ ద్వారా గుర్తింపు పొందిన ఏజెన్సీల నుంచి తప్పనిసరిగా ధృవీకరణ ఉండాలనే నిబంధన అమలు చేస్తారన్నారు. అలాగే ఆలయంలోని వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుంచి మూడు నమూనాలను తీసుకుని పరీక్షిస్తారని, ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారని లేఖలో తెలిపారు.
ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారని, ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరన్నారు. 2024, జులై 12న తిరుమలకు నెయ్యి ట్యాంకర్లు రాగా, కల్తీ జరిగిందని తిరస్కరించారని తెలిపారు. తిరస్కరించిన ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని జగన్ ప్రధానికి తెలిపారు. ట్యాంకర్లు వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు బాధ్యతా రాహిత్యంగా, వ్యాఖ్యలు చేశారన్నారు.