Menopause Skin Care Tips : ప్రతి మహిళ లైఫ్‌లో మెనోపాజ్ సహజం. నార్మల్‌గా 40-50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు ఈ దశకు చేరుకుంటారు. కొందరిలో 40ల్లోపే ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని 'ప్రిమెచ్యూర్ మెనోపాజ్'గా పిలుస్తారు. ఏదేమైనా ఈ స్టేజ్‌లోకి ప్రవేశించే క్రమంలో మహిళల్లో కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి.
వయసు పెరిగే కొద్దీ మహిళలను కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే మెనోపాజ్ దశ మొదలైనప్పటి నుంచి చర్మం బాగా పొడిబారుతుంది. ముడతలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. దీంతో మహిళలు ఒక్కసారిగా వృద్ధురాలిని అయిపోయానని చాలా బాధపడుతుంటారు. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ముడతలను అదుపు చేయవచ్చని ప్రముఖ సౌందర్య నిపుణులు డాక్టర్ శైలజ సూరపనేని చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
మెనోపాజ్ దశలో చర్మం సాగడం, గీతలు, ముడతలు సర్వసాధారణం. ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడంతో ఇలా శరీరంలో మార్పులు వస్తాయి. ఈ దశలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా వివిధ రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అయితే, దీనిని పూర్తిగా ఆపలేం. కానీ, కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల కొంతవరకూ అదుపు చేయగలం. చాలా మంది మహిళలు ఈ వయసులో ఇవన్నీ ఎందుకు అని లైట్ తీసుకుంటారు. అలా అనుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు.
"రోజూ క్రీమ్ ఆధారిత మైల్డ్ క్లెన్సర్లు, మాయిశ్చరైజర్లను ఉపయోగించాలి. ఎక్కువ వేడినీటి స్నానం చేయకూడదు. మెనోపాజ్‌కు ముందూ వెనకా ఎండలో ఎక్కువగా తిరిగినా ముడతలు మరింత అధికంగా కనిపిస్తాయి. ఇవి కొద్దిమొత్తంలో ఉంటే క్రీములతో అదుపు చేయొచ్చు. అయితే ఆలిగో పెప్టైడ్లు, హైడ్రాక్సీ యాసిడ్లు, హైలురోనిక్ యాసిడ్, కాపర్ పెప్టైడ్లు, విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి." - డాక్టర్ శైలజ సూరపనేని (సౌందర్య నిపుణులు)
ఇంజెక్షన్లతో :
నైట్ టైమ్‌లో రెటినాల్, ఆల్ఫా, బీటా హైడ్రాక్సీ యాసిడ్లు ఉన్నవి వాడుకుంటే మంచిది. ముడతలు, గీతలు ఎక్కువగా ఉంటే క్రీములతో పాటు డర్మాబ్రేషన్, మైక్రోడర్మాబ్రేషన్, కెమికల్‌పీల్స్, లేజర్ థెరపీలనూ ప్రయత్నిస్తే ఫలితం ఉంటుంది. బొటాక్స్ ఇంజెక్షన్లను కూడా తీసుకోవచ్చు. వీటితో కొన్ని రోజుల వరకు ముడతలను ఆపొచ్చు. అయితే ప్రతి 6 నెలలకోసారి చేయించుకోవాలి. ఈ దశలో ఫిల్లర్స్‌ని తీసుకుంటే ముడతలు తగ్గుతాయి.
ముందు నుంచే జాగ్రత్త పడాలి!
ముడతలు వచ్చాక చికిత్సలు తీసుకోవడం కంటే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అందుకే 20 ఏళ్లలోకి అడుగు పెట్టినప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలో ఆలివ్ ఆయిల్లో తేనె, విటమిన్ ఇ నూనెను కలిపి రాసుకోవాలి. ఆపై అయిదు నిమిషాలయ్యాక కడిగేయాలి. కలబంద గుజ్జుకు విటమిన్ ఇ ఆయిల్ కలిపి రాసి, అరగంట సేపు ఉంచినా మంచి ఫలితం కనిపిస్తుంది. వీటితోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. డైట్లో సోయాకి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. అలాగే రోజూ వ్యాయామం చేయాలని డాక్టర్ శైలజ సూరపనేని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
"గుంజిళ్లతో మెదడుకు ఎంతో మేలు - ఈ విషయాలు మీకు తెలుసా?"
చలికాలంలో చర్మం పొట్టు ఇలా ఊడుతోందా? - ఈ చిట్కాలు సూచిస్తున్న నిపుణులు!