Sankranti Celebrations in Vijayawada : సంక్రాంతి పండుగ శోభతో తెలుగిళ్లు సందడిగా మారాయి. విజయవాడ, విశాఖ లాంటి నగరాలు దుకాణాలు, వాహనాలు లేక బోసిపోయినా ఓ మోస్తరు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. నగరాలు, పట్టణాల్లోని ట్రాఫిక్ అంతా ఇప్పుడు పల్లెలు, గ్రామీణ ప్రాంతాలకు మారిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లు ఎటు చూసినా వాహన ట్రాఫిక్ తో కిక్కిరిసిపోయాయి. మరోవైపు కోడిపందేల బరులు ఎక్కడికక్కడ ఏర్పాటు కావటంతో పందెం రాయుళ్లతో పాటు సాధారణ ప్రజలు కూడా పెద్ద ఎత్తున వాటిని వీక్షించేందుకు వెళ్తున్నారు.
మరోవైపు గడిచిన రెండు రోజులుగా కోడిపందేల బరుల్లో కోళ్లకు బదులు కోట్లు ఎగిరిపోయాయి. సంక్రాంతి సందడి అంతా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తోంది. విజయవాడ, విశాఖ లాంటి పట్టణాలు వాహనాలు, దుకాణాలు లేక బోసిపోయినా ఆ సందడి అంతా శివారు గ్రామాల్లో కనిపిస్తోంది. రాష్ట్రమంతటా సంక్రాంతి శోభతో తెలుగిళ్లు వెలిగిపోతున్నాయి. బంధువుల రాకతో నగరాలు, పట్టణాల్లో ఉండాల్సిన ట్రాఫిక్ ఇప్పుడు గ్రామీణ వీధుల్లో కనిపిస్తోంది. కోడిపందెలు, ఎడ్లతో వాతావరణం సందడిగా మారింది.
కత్తి కట్టొద్దని పోలీసులు హెచ్చరించినా పందెం రాయుళ్ల పంతమే నెగ్గింది
ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందేల బరులు వెలిశాయి. విజయవాడ శివారు ప్రాంతాలైన రామవరప్పాడు, ఎనికేపాడు, సింగ్ నగర్, గన్నవరం, ఉప్పులూరు, ఈడ్పుగల్లు, కంకిపాడు , నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం తదితర ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడిపందేల బరులు ఏర్పాటు చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో 64 బరులు, కృష్ణా జిల్లాలో 61 ఏర్పాటయ్యాయి. స్థానిక నేతల కనుసన్నల్లో ఏర్పాటైన ఈ బరుల్లో పెద్ద ఎత్తున కొడిపందేలు కొనసాగుతున్నాయి. బరుల్లో అధికారికంగా టోకెన్ పందాలు, అనధికారికంగా పై పందేల పేరిట కోళ్లతో పాటు కోట్లు కూడా ఎగిరిపోతున్నాయి. ఒక్క కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే దాదాపు రూ. 300-400 కోట్ల రూపాయల మేర జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. పందెం రాయుళ్లతో పాటు సాధారణ ప్రజలు కూడా ఈ కోడిపందేల బరుల్ని చూసేందుకు ఉత్సాహంగా తరలివస్తున్నారు.
ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన- సంక్రాంతి సంబరాల్లో హుషారు
ఏపీలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సహా ఇతర తెలంగాణా జిల్లాలు, బెంగుళూరు, చెన్నై నగరాలతో పాటు ఆయా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రముఖులు తరలి వచ్చారు. అటు విదేశాల నుంచి ఎన్ఆర్ఐ లు సైతం సంక్రాంతి పండుగకు తమ సొంతూళ్లకు వచ్చి కోడిపందేల్లో పాల్గోంటున్నారు. కోడిపందేల బరుల్లో గుండాట, పేకాట లాంటి జూద క్రీడలు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.