YSRCP MLC Duvvada Srinivas Family Issue :ఏపీలోని శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. రెండు రోజులుగా ఆయన్ను కలిసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులను ఆయన గేట్లు మూసేసి లోపలకు అనుమతించలేదు. శుక్రవారం రాత్రి 7 గంటలనుంచి 9గంటల వరకు అక్కడే నిరీక్షించిన భార్య దువ్వాడ వాణి, పెద్ద కుమార్తె హైందవి చేసేదిలేక వెనుదిరిగారు. రాత్రి 10గంటల సమయంలో మరోసారి అక్కడకు వచ్చి తెరచి ఉన్న మరో గేటుద్వారా లోపలకు ప్రవేశించారు.
ఇంటికి తాళాలు వేసిఉండటంతో వాటిని తెరిచే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాసేపటికే భార్య, కుమార్తెపై తిట్లదండకం, బూతుపురాణంతో రెచ్చిపోయి వీరంగం సృష్టించారు. గ్రానైట్ రాడ్తో దాడి చేసేందుకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు నిలువరించారు.
Duvvada Srinivas Family Controversy :ఇళ్లు తనదని, అక్కడినుంచి వెళ్లిపోవాలని దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో రగిలిపోగా, కుటుంబీకులు వెళ్లేందుకు నిరాకరించి అక్కడే బైఠాయించారు. కాసేటికి దువ్వాడ వాణి తరఫు బంధువులు అక్కడకు చేరుకుని ఎమ్మెల్సీ తీరును తప్పుబట్టారు. దువ్వాడ శ్రీనివాస్, వాణి దంపతుల మధ్య ఏడాదిన్నరగా వివాదం నడుస్తోంది. దీంతో జాతీయ రహదారి పక్కన కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఆయన వేరుగా ఉంటున్నారు. ఆయన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని కలసి ఉంటున్నారని, కుమార్తెలు కలవడానికి వెళ్లినా అనుమతించడంలేదని ఆమె భార్య శుక్రవారం మీడియా ఎదుట ఆరోపణలు చేశారు.