YSRCP MLA followers attack villagers:దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా అంధ్రప్రదేశ్లో ఇంకా వైఎస్సార్సీపీ రాజ్యమే నడుస్తుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఎదురు చెప్పాలన్నా, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎదురెళ్లాలన్నా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా దెందులూరులో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి మర్యాద ఇవ్వలేదంటూ ఆయన అనుచరులు దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పర్యటనలో గౌరవం ఇవ్వలేదంటూ తిమ్మనపూడి గ్రామంలోని యువకులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు.
చెయ్యి ఊపి అభివాదం చేసిన ఎమ్మెల్యే: ఎమ్మెల్యే చెయ్యి ఊపి అభివాదం చేస్తే, లేచి నిలబడకుండా, కూర్చునే చెయ్యి ఊపుతారా అంటూ ఎమ్మెల్యే అనుచరులు యువకులపై దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఏలూరు జిల్లా తిమ్మనపూడి గ్రామంలో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మం. తిమ్మన్నగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారం అనంతరం తిరిగి వెళ్తూ, గ్రామంలోని ఓ కూడలిలో కూర్చున్న యువకులను చూసి చెయ్యి ఊపి అభివాదం చేశారు. యువకులు సైతం తిరిగి చెయ్యి ఊపి అభివాదం చేయగా, కూర్చుని చెయ్యి ఊపుతారా అంటూ ఎమ్మెల్యే ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా వాహనాలు ఆపి యువకులపై దాడికి దిగారు.
టీడీపీ సానుభూతిపరురాలిపై వైఎస్సార్సీపీ నేతల దాడి- వీడియో వైరల్
గాయపడిన యువకుడికి చికిత్స: వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిలో గ్రామానికి చెందిన పిప్పర దుర్గా ప్రసాద్ అనే యువకుడికి గాయాలు అయ్యాయి. గాయపడిన యువకులను ఏలూరు సర్వ జన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. దాడి వీడియో తీస్తున్న మరో యువకుడి ఫోన్ను ఎమ్మెల్యే అనుచరుడు కామిరెడ్డి నాని లాక్కున్నారు. బలవంతంగా ఆ ఫోన్లో ఉన్న వీడియోలు తొలగించారు. ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసిన ఘటనపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవం అనేది మనస్సులో ఉండాలని, బలంతంగా గౌరవం రాదని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తలపై చర్యలు తీసుకోవాలంటూ గాయపడిన యువకుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.