రాష్ట్రంలో విచ్చలవిడిగా అక్రమ లే-అవుట్ల దందా- నిమ్మకునీరెత్తినట్లుగా జగన్ సర్కారు YSRCP Leaders Illegal Layouts in AP: రాష్ట్రంలో వైసీపీ హయాంలో అక్రమ లే-అవుట్లు విచ్చలవిడిగా వెలుగుచూస్తున్నాయి. ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అండదండలు, అధికారుల సహకారంతో అనుమతులు లేని లే-అవుట్ల వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోంది. కొన్నిచోట్ల అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు, వారి సన్నిహితులు స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల స్థిరాస్తి వ్యాపారులకు వారు అండదండలు అందిస్తూ అక్రమ లే-అవుట్లను ప్రోత్సహిస్తున్నారు.
అందుకు ప్రతిఫలంగా భారీగానే సొమ్ము వసూలు చేస్తున్నారు. వెంచర్లు ఏర్పాటుచేస్తే విక్రయాల ద్వారా వచ్చే మొత్తంలో 10శాతం నుంచి 20శాతం వరకు డబ్బు దోచేస్తున్నారు. ఖరీదైన వెంచర్ల దగ్గర ఈ దందా మరీ ఎక్కువ. ఈ అదనపు ఖర్చునంతా స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలుదారులపై మోపుతున్నారు. వ్యాపారం సజావుగా సాగాలంటే అధికార పార్టీనేతలను ప్రసన్నం చేసుకుని వారికి మామూళ్లు ఇచ్చుకోవాలి. అలా చెల్లించిన వారి జోలికి వెళ్లని పురపాలక, కార్పొరేషన్ అధికారులు డబ్బు ఇవ్వకపోతే మాత్రం భయాందోళనకు గురిచేస్తున్నారు.
ఇలా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, నేతల అండదండలతో రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలు, వాటి శివారు ప్రాంతాల్లో అనుమతులు లేని వెంచర్లు, అక్రమ లే-అవుట్ల దందా విపరీతంగా జరుగుతోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు కూడా భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ అక్రమాలు బహిరంగంగానే జరుగుతున్నా పంచాయతీ, రెవెన్యూ, మండల పరిషత్, నీటిపారుదల శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అలా కాదంటూ నిబంధనల మేరకు చర్యలకు ఉపక్రమించేందుకు కొన్నిచోట్ల అధికారులు ప్రయత్నిస్తే పై నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి.
బంగాళాఖాతం పక్కనే జగనన్న బడాయి మాటలు - సంక్రాంతికి పక్కా - దసరాకి వచ్చేస్తా - మరో'సారీ'
కృష్ణా జిల్లా అవనిగడ్డ-యనమలకుదురు కరకట్ట రహదారిలో అక్రమ లే-అవుట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కరకట్ట కింద లంకభూముల్లో తట్ట మట్టి కూడా తవ్వకూడదని నీటి పారుదల శాఖ, నదీ పరీవాహక పరిరక్షణ చట్టం నిబంధనలు స్పష్టంగా ఉన్నా అమలు కావట్లేదు. అక్రమ లే-అవుట్లకు కొన్నిచోట్ల హంగులు, ఆర్భాటాల కోసం నిర్వాహకులు ఏకంగా కరకట్టనే తవ్వేసి, ర్యాంపులు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల పరిధిలో 15 వేల వరకు అనధికారిక లే-అవుట్లు ఉన్నాయి.
ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2 వేల వరకు ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనూ అనుమతులు లేకుండా యథేచ్ఛగా లే-అవుట్లు వేసి, ఇళ్ల స్థలాలను విక్రయిస్తున్నారు. ఏలూరు, కర్నూలు, కోనసీమ, నెల్లూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, ప్రకాశం, గుంటూరు తదితర జిల్లాల్లోనూ అనధికారిక లే-అవుట్లు అధికంగానే ఉన్నాయి. విశాఖపట్నం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 1,045 ఎకరాల విస్తీర్ణంలో అనధికారిక లే-అవుట్లు వెలిశాయి. రాష్ట్ర ఖజానాకు 155 కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉందని అధికారులు గుర్తించారు.
కృష్ణా జిల్లాలో 194 ఎకరాల విస్తీర్ణానికి సంబంధించి 67 కోట్ల చొప్పున ప్రభుత్వానికి జమ కావాలి. అనకాపల్లి జిల్లాలో 1,679 ఎకరాలకు సంబంధించి 52 కోట్లు, తిరుపతి జిల్లాలో 1,141 ఎకరాలకుగాను 36 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు చేరాలి. గతేడాది మార్చిలో సేకరించిన ప్రకారం ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో సుమారు 60 లే-అవుట్ స్థలాలు ఉంటే వాటిలో 20కి పైగా స్థలాలకు అనుమతులు లేవు.
సంతకాలు ఫోర్జరీ చేసి భూములు దోపిడీ - రెచ్చిపోతున్న వైసీపీ మూకలు
భూ వినియోగ మార్పిడి చట్టాన్ని అనుసరించి భూ విస్తీర్ణానికి తగ్గట్లు కాకుండా తక్కువగా ఫీజు చెల్లించడం, అసలు చెల్లించకపోవడం వంటి అంశాల ప్రాతిపాదికన రికార్డులు పరిశీలిస్తే సుమారు 20 వేల ఎకరాల వ్యవసాయ భూమి అనధికారికంగా వ్యవసాయేతర భూమిగా మారింది. దీనివల్ల 700 కోట్ల వరకు ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లింది. కిందటేడాది ఏప్రిల్ 1 నుంచి ఇటీవల వరకు సుమారు 5వేల ఎకరాల ఎకరాల వ్యవసాయ భూమి వ్యవసాయేతర భూమిగా మారింది.
వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పు చేయాలంటే అందుబాటులో ఉన్న స్థలంలో సామాజిక అవసరాలకు 10శాతం ఖాళీ స్థలాన్ని వదిలి, దారులు నిర్మించాలి. అలాగే బేసిక్ మార్కెట్ విలువకు తగ్గట్లు ఫీజును ప్రభుత్వానికి చెల్లించాలి. భూ వినియోగ మార్పిడి, డెవలప్‌మెంట్ ఛార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఫీజుల కింద భారీ ఎత్తున చెల్లించాల్సి వస్తుందన్న ఉద్దేశంతో స్థిరాస్తి వ్యాపారులు అనధికారికంగానే ప్లాట్లను విక్రయిస్తున్నారు.
ఫలితంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకులు రుణాలు ఇవ్వవు. అత్యవసరంగా అమ్ముకోవాలంటే కొనుగోలు చేసే వారు ముందుకు రారు. వీటి గురించి సరైన అవగాహన లేని అమాయకులైన పేద, మధ్యతరగతి కుటుంబాల వారు స్థిరాస్తి వ్యాపారుల మాయలో పడి ఈ ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు.