CM Chandrababu Naravaripalle Tour: చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నేడు పలు అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రూ.2 కోట్లతో రంగంపేటలో రహదారుల నిర్మాణం, రూ.కోటితో రంగంపేట జడ్పీ హైస్కూల్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అదే విధంగా నారావారిపల్లెలో రూ.3 కోట్లతో విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు చౌక, నాణ్యమైన నిత్యావసరాల చేరవేతకు ఈజీ మార్ట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈజీ మార్ట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న మహిళా సంఘాలకు నిత్యావసరాలు చేరవేయనున్నారు. నారావారిపల్లెలో మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల్లో బుద్ధి కుశలత మెరుగుదలకు కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నారావారిపల్లె పరిధిలోని 8 అంగన్వాడీ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా దీనిని అమలు చేయనున్నారు.
నారావారిపల్లెలో సంక్రాంతి సందడి - పోటీల్లో పాల్గొన్న మహిళలకు కానుక
కాగా సంక్రాంతి కోసం సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి స్వగ్రామం తిరుపతి జిల్లా నారావారిపల్లెకు చేరుకున్నారు. 14వ తేదీ వరకు నారావారిపల్లెలోనే ఉంటారు. అదే విధంగా విద్యాశాఖ మంత్రి లోకేశ్ దంపతులు, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర సైతం నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, మరికొందరు బంధువులు శనివారమే అక్కడకు వెళ్లారు. వారంతా ఆదివారం సాయంత్రం స్థానిక శేషాపురం సమీపంలోని శేషాచల లింగేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు.
కందులవారిపల్లిలోని వినాయకస్వామి గుడిలో పూజల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ముందుగా తన సోదరి హైమావతి భర్త కనుమూరి సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడిన తరువాత నారావారిపల్లె చేరుకున్నారు. ఇంటివద్ద ప్రజల నుంచి సీఎం చంద్రబాబు అర్జీలు స్వీకరించారు.