TTD CHAIRMAN AND EO ON FAKE NEWS: తిరుపతిలో వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సమన్వయం లోపం వల్ల జరిగిందన్న వార్తలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలు, ప్రచార ఛానళ్లలో తిరుమలపై వస్తున్న అసత్య వార్తలను ఖండించేందుకు ఛైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియా సమావేశం నిర్వహించారు.
జనవరి 8వ తేదీన జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరమైనదని, వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు బాగానే చేశామని, అనుకోకుండా తొక్కిసలాట చోటు చేసుకుందని ఛైర్మన్ బీఆర్ నాయుడు విచారం వ్యక్తం చేశారు. తన పేరు మీద తనకు ప్రమేయం లేకుండానే కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఛైర్మన్ ఖండించారు.
ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి: సామాజిక మాధ్యమాల్లో తనపై, తిరుమలపై తప్పుడు ప్రచారాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. వార్త ప్రచారం చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి రాయాలని ఛైర్మన్ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు, గాయపడిన వారికి మొత్తం 31 మందికి నష్ట పరిహారం అందజేశామని, మరో 28 మందికి మంగళవారం లోపల అందజేస్తామన్నారు.
ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం: సామాజిక మాధ్యమాల్లో తిరుమలపై తప్పుడు ప్రచారం జరుగుతోందని, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన పని ఒత్తిడి వల్ల ఇలాంటి వార్తలను పట్టించుకోలేదని టీటీడీ ఈవో శ్యామలరావు అన్నారు. సమన్వయం లోపం వల్ల ఘటనలు చోటు చేసుకున్నాయన్న వార్తలు అవాస్తవమన్నారు. టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడును విభేదించానన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని, టీటీడీలో ధర్మకర్తల మండలి అధ్యక్షుడే అత్యంత కీలక పాత్ర అని ఈవో తెలిపారు. వైకుంఠ ద్వార దర్శనాలకు అన్ని ఏర్పాట్లు బాగానే చేశామని, తిరుపతిలో సర్వ దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అన్నీ ప్రోటోకాల్ ప్రకారమే జరిగాయని, టోకెన్లు జారీ క్రమంలో భక్తులను వదిలినప్పుడు అనుకోకుండా తొక్కిసలాట జరిగిందన్నారు.
ఆరు నెలల్లో తిరుమలలో అనేక మార్పులు చేశాం: దీనిపై విచారణ జరుగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆరు నెలల్లో తిరుమలలో అనేక మార్పులు చేశామని గుర్తు చేశారు. ప్రక్షాళనలో భాగంగా కల్తీనెయ్యి వినియోగాన్ని గుర్తించి, సరఫరాదారులపై చర్యలు తీసుకున్నామన్నారు. స్వచ్ఛమైన నెయ్యితో ప్రసాదాల్లో నాణ్యత తీసుకొచ్చామని, దళారీలను అరికట్టామని, వేల సంఖ్యలో ఉన్న ఆన్లైన్ బ్రోకర్ల బెడదను నివారించామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఇబ్బందులు లేకుండా అనేక చర్యలు తీసుకున్నామన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, భవిష్యత్తులో ఇంకా అనేక మార్పులు తీసుకొని రావాల్సి ఉందన్నారు.