Kanuma Festival Significance : భోగి మంటలతో మొదలై మకర సంక్రాంతి రోజున పితృదేవతల తర్పణంతో ఉజ్వలమయ్యే సంక్రాంతి వేడుకలు కనుమ రోజున కలిమినందిస్తూ ముగుస్తాయి. కనుమ పర్వదినాన పశువుల్ని పూజించడం ఆనవాయితీ. దుక్కి దున్నే దగ్గరి నుంచి పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చేవరకు అన్నదాత వెన్నంటి నడిచే పాడిపశువులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. పశువులను నీటితో కడిగి పసుపు-కుంకుమ పూసి ఊరేగిస్తారు. పశువులకు హారతులిచ్చి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు.
కనుమ నాడు మాంసాహారం తినడం సంప్రదాయం. ఈ రోజున మినుము తినాలనే ఆచారం ప్రకారం గారెలు, ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో పరిపాటి. మరోవైపు ఆరోజు ప్రయాణాలు చేయకూడదంటారు. ఇంటిల్లిపాదీ కలిసి పిండి వంటలు తింటారు. ఇరుగుపొరుగు వారికి పంచిపెడతారు. కనుమ రోజున వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషీ ఓ రథం అని, దాన్ని నడిపేవాడు పరబ్రహ్మ అని భావిస్తారు.
Sankranti Celebrations 2025 in AP : శరీరమనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్మని ప్రార్థించడమే రథం ముగ్గు ఉద్దేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ ఇంటి ముందు రథం ముగ్గులు వేసి అందులో పళ్లు-పూలు, పసుపు-కుంకుమ వేసి గౌరవంగా సాగనంపుతారు. వాకిళ్లలో వేసిన రథం ముగ్గును పక్కింటి ముగ్గుతో అనుసంధానం చేస్తారు. ఇలా ప్రతి ఇంటి ముందు వేసిన ముగ్గులన్నీ ఊరు పొలిమేర వరకూ సాగుతాయి.
కనుమ సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహించే ప్రభల తీర్థాలు ఓ ప్రత్యేక ఆకర్షణ. రుద్రులు కొలువైన కొబ్బరితోటల్లో తమ ఊరి ప్రభలను తీసుకెళ్లి పూజిస్తే సుఖసంతోషాలతో ఉంటామనేది గోదావరి ప్రజల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నతోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు తలమానికంగా నిలుస్తాయి. వందల గ్రామాలకు చెందిన వేల ప్రభలను తీర్థానికి తరలిస్తారు. అక్కడికి పిల్లాపాపలతో వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి వేళ పాటించే ప్రతి ఆచారమూ మనిషిని ప్రకృతితో జత చేసేదే! బంధుత్వాలను కలుపుతూ, ఆనందాలను పంచుతూ, మనుషులందరినీ ఒక్కటి చేసేదే సంక్రాంతి పండగ.