YSRCP Leaders Irregularities in Chicken Waste :వైఎస్సార్సీపీ హయాంలో ఆ పార్టీ నేతలు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. కాసుల వేట కోసం వారు చేసిన అక్రమాలు ఒక్కొటి వెలుగులోకి వస్తున్నాయి. కోళ్ల వ్యర్థాల్లోనూ వైఎస్సార్సీపీ నేతలూ డబ్బులు దండుకోవడం బయటికి వచ్చింది. మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉత్పత్తయ్యే కోళ్ల వ్యర్థాలను నిబంధనల ప్రకారం కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లాలి. చట్ట విరుద్ధంగా చేపల చెరువులకు తరలించారు. ఇలా ప్రజారోగ్యంతో చెలగాటమాడి రూ.కోట్లు ఆర్జించారు.
గత ప్రభుత్వంలో ముగ్గురు గుత్తేదార్లకు కోళ్ల వ్యర్థాల తరలింపు టెండరు దక్కించుకున్నారు. కానీ ఆర్నెళ్లలోనే పూర్తిగా పరిస్థితులు మారిపోయాయి. కోళ్ల వ్యర్థాలకు మంచి గిరాకీ ఉండటంతో, నాటి అధికార పార్టీకి చెందిన కొందరు కార్పొరేటర్లు రంగంలోకి దిగి దందాను సాగించారు. తమ వార్డుల్లో వ్యర్థాలు తామే తీసుకుంటామంటూ గుత్తేదార్లకు తెలిపారు. కోళ్ల వ్యర్థాల విక్రయాల్లో మధురవాడ, భీమిలి, ఎంవీపీకాలనీ, తాటిచెట్లపాలెం, కంచరపాలెం, గాజువాక ప్రాంతాల్లోని కొందరు కార్పొరేటర్ల హస్తం ఉందన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్సీపీలో కోళ్ల వ్యర్థాల చిచ్చు రేగడంతో, ఒక దశలో ఆ పార్టీ కీలక నాయకులూ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అందుకే పోటీ :విశాఖలో ఉత్పత్తయ్యే కోళ్ల వ్యర్థాలను ఉమ్మడి విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో భారీ విక్రయాలతో ఎక్కువ మొత్తంలో వ్యర్థాలు సమకూరుతున్నాయి. పైగా వీటికోసం చేపల చెరువుల యజమానుల మధ్య పోటీ ఉంది. దీంతో కోళ్ల వ్యర్థాలకు డిమాండ్ పెరిగి భారీ ఆదాయం వస్తుండటంతో కొందరు కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.