YSRCP Leaders Attack on Dalits in Raptadu : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతల అరాచకాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో స్థానిక ఎమ్మెల్యే తోపుదుర్తి అనుచరులు రెచ్చిపోయారు. ప్రసన్నాయపల్లిలోని దళిత కాలనీలో పూరిళ్లను తగలబెట్టారు. గ్రామంలోని రెవెన్యూ పరిధి 123/2బీ సర్వే నంబరులోని రెండెకరాల్లో స్థానిక దళితులు కొన్ని రోజుల కిందట పూరిపాకలు వేసుకున్నారు. ఆ భూమిపై అంతకుముందే వైసీపీ నాయకులు కన్నేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
YSRCP Leaders Attack on Dalits :ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని రెండు రోజులుగావైసీపీ (YSRCP) నాయకులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము నిరాకరించడంతో పలుమార్లు దౌర్జన్యానికి దిగారని బాధితులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం జైభీమ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రసన్నాయపల్లికి వచ్చి దళితులను పరామర్శించారు. జగన్ ప్రభుత్వం దళితులపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి అనుచరులు, తమకు వ్యతిరేకంగా దస్తగిరిని తీసుకొస్తారా అంటూ రాత్రి 9:30 గంటల ప్రాంతంలో దళిత కాలనీపై దండెత్తారు. కర్రలు, ఇనుపరాడ్లతో వారిపై విచక్షణరహితంగా దాడి చేసి, గుడిసెలను తగలబెట్టారు.
నిన్న ఫుల్ - నేడు నిల్ - కుప్పానికి హంద్రీనీవా జలాల 'సినిమా సెట్టింగ్'
వైఎస్సార్సీపీ నేతల దాడిలో పలువురికి గాయాలయ్యాయి. జైభీమ్ భారత్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ ఇంఛార్జ్ నరేశ్, కార్యకర్త విజయ్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదని బాధితులు చెబుతున్నారు. క్షతగాత్రులను అనంతపురం సర్వజనాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైసీపీ నాయకుల దాడుల నుంచి తప్పించుకున్న దళితులు రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీశారు. సీఐ మునిస్వామి శ్రీకాళహస్తిలో బందోబస్తులో ఉండటంతో ఆ సమయంలో అక్కడ ఇటుకలపల్లి సీఐ నరేందర్ విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ నాయకులు తమపై దాడికి పాల్పడుతున్నారని ఫిర్యాదు చేస్తే సీఐ కనీసం పట్టించుకోలేదని, తిరిగి తమనే అసభ్యపదజాలంతో దూషించారని బాధితులు వాపోయారు.