YSRCP Leader Raped Woman in AP : గడిచిన ఐదేళ్లు ఏపీలో అరాచకం ఎంత విచ్చలవిడిగా విహారం చేసిందో అందరికీ తెలిసిందే. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు ఇలా ఒక్కటేమిటీ.. అన్నింటిలోనూ గత వైఎస్సార్సీపీ ముందంజలోనే ఉంది. ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులైతే మానవ మృగాళ్లలా మహిళలను హింసించే వారు. కాదంటే కేసులు పెట్టి ఏదో విధంగా లొంగదీసుకునేవారు. న్యూడ్ వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తానంటూ బెదిరించి వైఎస్సార్సీపీకి చెందిన ఓ నాయకుడు తనను రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడంటూ తాజాగా ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తన భర్తపై కూడా పలుమార్లు హత్యాయత్నం చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. గుంటూరు జిల్లాకు చెందిన బాధితురాలు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఏఎస్పీ సుప్రజ, నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, 'గుంటూరులో తిను బండారాల తయారీ వ్యాపారం చేస్తున్నాం. వెంగళాయపాలేనికి చెందిన వైఎస్సార్సీపీ నేత దేవరకొండ నాగేశ్వరరావు అలియాస్ ఓంకార్ పలుమార్లు మా దుకాణానికి వచ్చాడు. ఆ తర్వాతనే మా షాపులో దొంగతనం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న నాగేశ్వరరావు నా భర్త లేని సమయంలో దుకాణం వద్దకు వచ్చి తాను వైఎస్సార్సీపీ పార్టీకి చెందినవాడినని, తనకు మద్దాలి గిరి, అప్పిరెడ్డి బాగా తెలుసంటూ తనకు చెప్పాడు. తన పలుకుబడితో చోరీ చేసిన వారిని పట్టుకుంటానని చెప్పి నా ఫోన్ నంబరు తీసుకుని, పరిచయం పెంచుకున్నాడు. ఓ రోజైతే ఏకంగా దుకాణం లోపలికి వచ్చి నాపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పుడు నాకు తెలియకుండా వీడియోలు, ఫొటోలు తీసుకున్నాడు. వాటిని అడ్డం పెట్టుకొని తరచూ బెదిరించి, అత్యాచారం చేసేవాడ'ని ఆమె వాపోయింది.
వాట్సాప్లో న్యూస్ కాల్స్ :రోజూ వాట్సాప్ కాల్ చేసి నగ్నంగా కనిపించాలని బెదిరించే వాడని ఆమె కన్నీరుపెట్టుకుంది. దొంగలను పట్టుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చెప్పి రోజూ రూ.4000 చొప్పున బలవంతంగా తీసుకెళ్లేవాడని తెలిపింది. ఇలా 2 ఏళ్లుగా బలవంతంగా అత్యాచారం చేస్తూ డబ్బులు తీసుకునేవాడని వాపోయింది. వ్యాపారం సరిగా లేక అప్పులు చేయడంతో డబ్బులు ఇవ్వలేనని చెప్పినట్లు పేర్కొంది. డబ్బులు అడిగితే ఇవ్వవా అంటూ గత నెల 23న తనపై విచక్షణారహితంగా దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ గాయాలను తన భర్త ప్రశ్నించగా, జరిగిన విషయం చెబితే వెంటనే పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయించారని తెలిపింది. అది మనసులో ఉంచుకొని నన్ను, నా కుటుంబసభ్యులను, భర్తను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడేవాడని వివరించింది.