Harish Rao Filed Quash Petition in HC : పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్ చేయాలంటూ హరీశ్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ఈ కేసులో పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా, అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో కోరారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్‌లో కార్యాలయం తీసుకొన్నారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఈ నెల 1వ తేదీన పోలీసులు 120(బి), 386, 409,506 సెక్షన్ల కింద, అలాగే రెడ్‌విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని హరీశ్‌రావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా రాజకీయంగా కీలకంగా వ్యవహరించడంతోపాటు 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారని పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజకీయ కక్ష్యల కారణంగానే హరీశ్‌రావుపై ఫిర్యాదు చేశారని, పోలీసులు కూడా తగిన సాక్ష్యాధారాలు సేకరించకుండానే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకుండా, అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని మధ్యంతర అప్లికేషన్‌లో కోరారు.
వేధించి బెదిరించారని హరీశ్‌రావుపై ఫిర్యాదు : 2021 మార్చిలో పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లో ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశానని హరీశ్‌రావుపై ఫిర్యాదు చేసిన గదగోని చక్రధర్‌గౌడ్ చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపునకు మళ్లించే దిశగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేశానని తెలిపారు. గతేడాది కూడా రైతు కుటుంబాలకు చెందిన 150 మంది వితంతులకు రూ.లక్ష చొప్పున నగదును పంపిణీ చేశానని తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో సహా ఏ ఇతర నేతలను ఆహ్వానించలేదని చెప్పారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలతో తనకు మంచి పేరు వస్తుందనే స్థానిక ఎమ్మెల్యే అప్పటి మంత్రి అయిన హరీశ్‌రావు తనపై కక్ష పెంచుకున్నారని గదగోని చక్రధర్‌గౌడ్ వెల్లడించారు. అప్పటి నుంచి హరీశ్‌రావు, అయన అనుచరుల నుంచి బెదిరింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు ఆపకపోతే చంపేస్తామని బెదిరించారని వివరించారు. ఎన్నికల సమయంలో తనతోపాటు తన కుటుంబసభ్యులు, మిత్రుల కదలికలపై కూడా నిఘా ఉంచారని, తమ ఫోన్లను సైతం ట్యాపింగ్ చేశారని ఫిర్యాదులో వివరించారు.
'అక్రమ కేసులు పెట్టించి వేధించారు' : హరీశ్‌రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు