YSRCP Govt Irregularities In Tirumala Tickets : "ఆపద మొక్కులవాడా అనాథ రక్షకా గోవిందా గోవిందా" అంటూ తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శనానికి తాపత్రయపడే భక్తులకు ఇచ్చే పలు రకాల టోకెన్లకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కొవిడ్ పేరుతో మంగళం పాడింది. స్వామి వారి దర్శనానికి భక్తులను దూరం చేసింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను తుంగలో తొక్కి సొంత ప్రయోజనాలకే పట్టం కట్టి అడ్డగోలు నిర్ణయాలలో ఆటలాడుకుంది. పాత టికెట్ల విధానాలకు స్వస్తి పలికి 3 నెలల ముందు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కొత్తగా ఏర్పడిన ధర్మకర్తల మండలి వీటిపై ఫోకస్ పెట్టి సేవలను సులభతరం చేయాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో : వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందిపడుతున్న వారికి తిరుమలలోని మ్యూజియం ఎదుట కౌంటర్లలో 2 విడతలుగా 1,500 దర్శన టికెట్లను జారీ చేసేవారు. వైఎస్సార్సీపీ సర్కారు హయాంలో కొవిడ్ పేరిట ఈ విధానాన్ని రద్దు చేశారు. ఆన్‌లైన్‌లో రోజుకు 1000 చొప్పున ఉచిత దర్శన టికెట్లను 3 నెలల ముందుగా జారీ చేస్తున్నారు.
పెద్ద ఎత్తున అవకతవకలు :కోర్కెలు నెరవేరిన భక్తులు తిరుమల శ్రీవారికి తలనీలాలతో పాటు పొర్లుదండాలు (అంగ ప్రదక్షిణలు) పెడుతుంటారు. వీరి కోసం సీఆర్వో కార్యాలయంలో రోజు 750 మందికి టికెట్లను జారీచేసేవారు. కొవిడ్ తర్వాత ఆన్‌లైన్‌లో 3 మాసాల ముందు జారీ చేస్తుండటంతో కొందరు టికెట్లు పొందినప్పటికీ దర్శనానికి రావటం లేదు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తరువాత ప్రతి శనివారం ప్రదక్షిణకు 250 టికెట్లు ఇస్తామంటూ తన వద్దే అట్టిపెట్టుకున్నారు. అవి ఎటు పోయాయో ఆ దేవదేవుడికే ఎరుకని, పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.