YSRCP Government No Clarity on Rushikonda : ఏ చిన్న పని పూర్తి చేసినా అంతులేని హడావుడి చేసే వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండ రిసార్టు విషయంలో మాత్రం అయోమయంలో ఉంది. వైఎస్సార్సీపీ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలో అత్యంత వేగంగా జరిగిన భారీ ప్రాజెక్టు ఇదే. వందల కోట్లు కుమ్మరించి ప్యాలెస్ నిర్మించారు. అలాంటి రాజసౌధం ప్రారంభోత్సవం జరిగి వారం కావస్తున్నా దానిని ఎందుకు ఉపయోగిస్తారో ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు.
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పూర్తి చేసిన ఆ నిర్మాణం దేనికోసమో ఆ శాఖ అధికారులు కాదు కదా వాటిని ప్రారంభించిన మంత్రులూ చెప్పలేకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేసి కొన్నిచోట్ల పండగ వాతావరణంలో ప్రారంభిస్తున్న వైసీపీ ప్రభుత్వం, 450 కోట్లు ఖర్చు చేసి కట్టి, రిబ్బన్ కత్తిరించిన ప్యాలెస్‌ను మాత్రం ఖాళీగా ఉంచేయడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తెలంగాణ నుంచి ఏపీఎండీసీకి వచ్చిన సొమ్మంతా జగన్ సర్కారుకే?
రుషికొండ రీడెవలప్‌మెంట్ రిసార్ట్ పేరుతో తీర ప్రాంత నియంత్రణ జోన్ అనుమతులు పొందగా అదే పేరుతో ఆ భవనాలను కొద్ది రోజుల కిందటే ప్రారంభించారు. వేంగి ఎ, వేంగి బి, కళింగ, గజపతి, విజయనగరం ఏ, బీ, సీ ఇలా మొత్తం ఏడు బ్లాకుల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంకెట్ హాళ్లు, గెస్ట్ రూములు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్‌నెస్ సెంటర్, బ్యాక్ ఆఫీస్ వంటివి అభివృద్ధి చేశామని అధికారులు చెబుతున్నారు. పర్యాటకావసరాలకైతే ప్రారంభోత్సవం రోజే అప్పగించొచ్చు. వందల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ భవనాలను ఉపయోగించుకోకుండా ఎందుకు నిరీక్షిస్తున్నారో అంతుపట్టడం లేదు.