YSRCP Government Lies :వైఎస్సార్సీపీ ప్రభుత్వ అక్రమాలకు, అబద్ధాలకు అడ్డేలేకుండా పోతోంది. హైకోర్టు, ఎన్జీటీలో ఇసుక అక్రమ తవ్వకాలపై కేసులు విచారణకు వచ్చిన ప్రతిసారీ స్టాక్ పాయింట్ల (Stock Points)లో ఇసుకనే విక్రయిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. గత ఏడాది ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రంలోని 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ గనులశాఖను, అప్పటి ఇసుక గుత్తేదారు జేపీ సంస్థను ఆదేశించింది. అప్పటికే స్టాక్ పాయింట్లలో ఇసుక ఉంటే.. దాన్నే విక్రయించాలంది.
Illegal Sand Mining in Andhra Pradesh :రాష్ట్రమంతా కలిపి 50 లక్షల టన్నుల ఇసుక ఉన్నట్లు గనులశాఖ అధికారులు అప్పట్లో చెప్పారు. ఇది మూడు, నాలుగు నెలలకే సరిపోతుంది. కానీ రాష్ట్రంలో అనేక నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వలు అలాగే ఉన్నాయి. నదుల్లో అక్రమంగా తవ్వి విక్రయిస్తున్నారు. పేరుకు నిల్వకేంద్రాల నుంచి విక్రయిస్తున్నట్లు వే బిల్లులు జారీ చేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయించి ఉంటారు.
"కేంద్ర అధికారులకు కనిపించిన ఇసుక అక్రమ తవ్వకాలు - కలెక్టర్లకు కనిపించడం లేదా?"
ఇసుక దోపిడీ, అక్రమ తవ్వకాలపై గత ఏడాది ఆగస్టు 25న టీడీపీ అధినేత చంద్రబాబు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విలేకరుల సమావేశంలో వివరించారు. దీనిపై గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ సంచాలకుడు వెంకటరెడ్డి ఆగస్టు 31న విలేకర్లకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో పూడిక తీసిన ఇసుకనే విక్రయిస్తున్నామని, ఎక్కడా ఓపెన్ రీచ్లో ఇసుక తవ్వకాలు లేవని చెప్పారు. కానీ అన్నిచోట్లా తవ్వకాలు కొనసాగుతునే ఉన్నాయి. ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని గత ఏడాది మే 2తో జేపీ సంస్థకు గడువు ముగిశాక రీచ్లలో ఇసుక తవ్వకాల్లేవని ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ డిసెంబరు 6న హైకోర్టులో చెప్పారు. అంతకుముందు తవ్వి, నిల్వచేసిన ఇసుకే తరలిస్తున్నామన్నారు. కానీ ఇప్పటికీ ఎక్కడా ఇసుక తవ్వకాలు ఆగలేదు.
పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేయొద్దని, అలా చేస్తే కలెక్టర్లు, గనుల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని హైకోర్టు బుధవారం స్పష్టంగా చెప్పింది. అయితే గురువారం కూడా ఇసుక తవ్వకాలు యథావిధిగా సాగాయి. హైకోర్టునూ లెక్క చేయకుండా దర్జాగా తవ్వకాలు కొనసాగించి విక్రయాలు చేశారు. కృష్ణా జిల్లాలో రొయ్యూరు, శ్రీకాకుళం, లంకపల్లి, చోడవరం, యనమలకుదురు వద్ద ఇసుక తవ్వకాలు కొనసాగాయి.