Vallabhaneni Gang Atrocities :అరాచకానికి నిలువెత్తు రూపం వల్లభనేని వంశీ. ఐదు సంవత్సరాలు అడ్డూఅదుపూ లేకుండా చెలరేగిపోయారు. చెరువులు, కుంటలను ఆక్రమించి, మట్టి గుట్టలను కరిగించి రూ.కోట్లకు పడగలెత్తారు. మరోవైపు ప్రత్యర్థి పార్టీల ఆఫీసులపై దాడులు చేస్తూ నాయకుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ వారి భూములను లాక్కుంటూ ఇదేమంటే పోలీసులతో కేసులు పెట్టిస్తూ జైళ్ల పాలు చేశారు.
వంశీ అండతో అతని ఆరుగురు ప్రధాన అనుచరులు సాగించిన అరాచకాలకు అడ్డే లేదు. జూదం, సెటిల్‌మెంట్లు, కబ్జాలు, దాడులుఇలా అరాచకాలను సైతం విభజించి, ఒక్కొక్కదాన్నీ ఒక్కో అనుచరుడికి అప్పగించి రూ.వందల కోట్లు కొల్లగొట్టారు. ఎంతోమంది పొట్టకొట్టారు. ప్రశాంత గన్నవరాన్ని అరాచకాలకు అడ్డాగా మార్చేశారు.
ఓలుపల్లి రంగా (ETV Bharat) ఓలుపల్లి రంగా : ఓలుపల్లి మోహనరంగారావు (రంగా) షాడో ఎమ్మెల్యేగా పేరొందాడు. మట్టి, గ్రావెల్ తవ్వకాలు మొదలైన ఆర్థిక కార్యకలాపాలన్నీ రంగా కనుసన్నల్లోనే నడిచాయనే ఆరోపణలున్నాయి. అతని అనుమతి లేనిదే వంశీని ఎవరూ కలవలేరు. ఉద్యోగులకు పోస్టింగ్‌లు, బదిలీలు, కాంట్రాక్టుల్లో కమీషన్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు ఏదైనా రంగాను ప్రసన్నం చేసుకోవాల్సిందే. తనతో పని జరగాలంటే భారీగా ముడుపులివ్వాలి లేదంటే వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుకోవాలనే నిబంధన పెట్టినట్టు సమాచారం. గత ఐదు సంవత్సరాల్లో ఇతను కూడా రూ.కోట్లలో ఆర్జించినట్లు వంశీ అనుచరులే చెబుతున్నారు. రంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని, రూ.500 కోట్లు సిద్ధం చేసుకున్నాడని ఇటీవల వంశీ అనుచరుడి ఆడియో సంభాషణ ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.
భీమవరపు రామకృష్ణ (ETV Bharat) భీమవరపు రామకృష్ణ : వల్లభనేని వంశీ బయటకొస్తే ఆయనతోపాటు కారులో పక్కనే కనిపించే భీమవరపు యతేంద్ర రామకృష్ణ (తేలప్రోలు రాము). గన్నవరంలో జరిగే జూద క్రీడలన్నింటికీ బాస్ అని టాక్. వంశీ ఆదేశాలతో గన్నవరాన్ని కోడి పందేలు, క్యాసినో, జూదానికి కేంద్రంగా మార్చింది ఇతనేననే ఆరోపణలున్నాయి. గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒకచోట శాశ్వత జూదం, కోడిపందేల శిబిరాలు నడిపించి రూ.కోట్లకు పడగలెత్తినట్లు సమాచారం.
భీమవరపు రామకృష్ణ క్రికెట్ బెట్టింగ్‌లో ఆరితేరి ఓ పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి రూ.వందల కోట్లు వెనకేశాడని ఆరోపణలున్నాయి. ఏటా సంక్రాంతికి అతడి ఆధ్వర్యంలోనే కోడిపందేలు, జూదం, క్యాసినోలు నడుపుతుంటారు. చీకోటి ప్రవీణ్, వంశీకి మధ్యవర్తిగా ఇతనే సంబంధాలు నడుపుతాడని తెలుస్తోంది. గన్నవరం నుంచి బడా జూదరులను చెన్నై, గోవా ప్రాంతాల్లో క్యాసినోలకు తీసుకెళ్లి ఆడించడంలోనూ ఇతనే కీలకమని సమాచారం.
కాట్రు శేషు : కాట్రు శేషు, వంశీకి రంగా తర్వాత అత్యంత సన్నిహితుడు. ఏ వ్యవహారంలోనూ తన జోక్యం లేనట్లు పైకి కనిపిస్తాడు. కానీ తెరవెనుక లావాదేవీలన్నీ ఇతని ఆధ్వర్యంలోనే కొనసాగుతాయనే పేరుంది. ప్రధానంగా భూ లావాదేవీలన్నీ శేషునే చూసుకుంటాడని సమాచారం. ఎయిర్పోర్ట్ విస్తరణకు భూసమీకరణ చేస్తారని తెలిసి గన్నవరం చుట్టుపక్కల అన్నదాతల నుంచి తక్కువ ధరకు ముందే కొని భారీగా ఆర్జించడం, గన్నవరం పరిధిలో జగనన్న లేఅవుట్లకు తక్కువకు భూమి కొని ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్మేయడం వంటి ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. ఈ అక్రమార్జనతోనే విశాఖ, బెంగళూరు ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కొన్నట్లు తెలుస్తోంది.
కొమ్మా కోట్లు (ETV Bharat) కొమ్మా కోట్లు : విజయవాడ గ్రామీణ మండలం ప్రసాదంపాడుకు చెందిన కొమ్మా కోటేశ్వరరావు (కోట్లు). వంశీ కోసం ఏకంగా ఓ ప్రైవేట్ సైన్యాన్నే ఏర్పాటు చేసి, విజయవాడ గ్రామీణ మండలంలో అరాచకాలు సాగించాడని సమాచారం. ఉపసర్పంచిగా, మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఉండి ప్రసాదంపాడు, ఎనికేపాడు, రామవరప్పాడు, నిడమానూరుల్లో అపార్టుమెంట్లు, అక్రమ లేఅవుట్లకు అండదండలు అందిస్తూ రూ.కోట్లు ఆర్జించినట్లు తెలుస్తోంది. పునర్విభజనలో విజయవాడ గ్రామీణ మండలం నియోజకవర్గంగా ఏర్పడితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భారీగానే డబ్బులు సిద్ధం చేసుకున్నాడని వంశీ అనుచరులే మాట్లాడుకుంటున్నారు.
అనగాని రవి :వల్లభనేని వంశీ అండతో గత ఐదు సంవత్సరాలు రెచ్చిపోయిన వాళ్లలో రవి కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న రవి బహిరంగంగానే వంశీని తమ్ముడూ అని ఏకవచనంతో సంబోధిస్తాడు. ఈ ఒక్కమాటే ఇతని అక్రమాలకు పెట్టుబడి అంటారు. వంశీనే తమ్ముడు అని పిలుస్తుండటంతో సామాన్యులు, అధికారులు ఇతడు చెప్పిందే వేదమన్నట్లుగా నడుచుకునేవాళ్లు. ఇదే అదనుగా సర్పంచులు, కార్యదర్శులను బెదిరించి నెలవారీ వసూళ్లు భారీగా చేసేవాడని తెలిసింది. గన్నవరం మండలంలో జరిగే ఏ పనిలోనైనా ఇతనికి కమీషన్లు ఇవ్వాల్సిందేనని చెబుతుంటారు. తన స్వగ్రామం అల్లాపురంలో ఎసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవడం, ఆస్తి తగాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసి రూ.కోట్లు సంపాదించాడనే ఆరోపణలున్నాయి.
మేచినేని బాబు (ETV Bharat) మేచినేని బాబు : గన్నవరంలో వంశీ కార్యాలయ ఇంఛార్జ్‌గా వ్యవహరించిన మేచినేని బాబు (ముస్తాబాద బాబు). అతను సాగించిన కబ్జాలు, సెటిల్‌మెంట్లకు లెక్కే లేదని ఆరోపణలున్నాయి. ముస్తాబాదలో చెరువులు, శ్మశానవాటికలు కబ్జా చేయడం, గన్నవరంలో అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లో భాగస్వాముల మధ్య తలెత్తిన విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవడం, వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకుని సెటిల్‌మెంట్లు చేసి రూ.కోట్లు గుంజడం లాంటి ఆరోపణలు కోకొల్లలు. గన్నవరంలోని పాత బంకు స్థల వివాదంలో తలదూర్చి రూ.3 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించినట్లు సమాచారం. కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో విల్లాలు, లేఅవుట్లు వేసేవారికి అధికార అండదండలిస్తూ రూ.కోట్లకు పడగలెత్తినట్లు తెలుస్తోంది.
తన కోసం కష్టపడిన వారిపైనే అక్రమ కేసులు - ఐదేళ్లలో వంశీ అరాచకాలు ఇవీ!
వంశీ కొల్లగొట్టింది రూ.195 కోట్లు - ప్రభుత్వానికి అందిన నివేదిక