YSRCP Illegal Constructions In AP :ఐదేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీలో వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణం జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు సర్వే నెంబరు 44లో రూ.2 కోట్ల విలువైన ఎకరా 50 సెంట్ల ప్రభుత్వ భూమిలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంటికి సమీపంలో దీన్ని నిర్మిస్తున్నారు. 2022 మే 18వ తేదీన 33 సంవత్సరాలకు గాను ఎకరాకు రూ.1000 చొప్పున స్థలాన్ని లీజుకు తీసుకున్నట్లు జీవో ఇచ్చారు. దీని నిర్మాణం కూడా పట్టణ ప్రణాళిక సంస్థ నుంచి అనుమతులు తీసుకోకుండానే తుది దశకు చేరింది.
విజయనగరం నడిబొడ్డున మూడున్నర కోట్ల విలువైన భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. మహరాజుపేట 540 సర్వే నంబర్లోని స్థలంపై కన్నేసిన వైఎస్సార్సీపీ నేతలు చెరువు గర్భం స్థలాన్ని రెవిన్యూ దస్త్రాల్లో డీ-పట్టాగా మార్పు చేసి తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇందులో ఎకరం విస్తీర్ణంలో వైఎస్సార్సీపీ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. దాదాపు 85 శాతం నిర్మాణం పూర్తైంది. దీనికీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదు.
మున్సిపల్ అధికారులు అనుమతులు లేకుండా :పార్వతీపురం మన్యం జిల్లాలో రూ.2కోట్ల విలువైన ఎకరం 18 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చివరి దశకు చేరింది. గతంలో ఈ స్థలాన్ని రైతు శిక్షణ కేంద్రానికి కేటాయించి శంకుస్థాపన కూడా చేశారు. విశాఖ ఎండాడలో 175/4 సర్వే నంబర్లో రూ.100 కోట్ల విలువైన 2ఎకరాల ప్రభుత్వ భూమిలో కార్యాలయ నిర్మాణం పూర్తి చేశారు. జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. గతంలో ఈ భూమిని రెవెన్యూ ఉద్యోగులకు కేటాయించారు. ఈ నిర్మాణానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు ఇప్పుడు నోటీసులు అంటించారు.
అనకాపల్లిలో రూ.15 కోట్ల విలువైన ఎకరం 75 సెంట్ల భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణం పూర్తి చేశారు. గతంలో ఈ భూమిని కాపు భవనానికి కేటాయించి శంకుస్థాపన సైతం చేసి రూ.50లక్షల నిధుల కేటాయింపులు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.5 కోట్ల విలువైన 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. ఇది సాగుభూమి అని గిరిజనులు అడ్డుకున్నారు. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.
ఇక కాకినాడలో రూ.75 కోట్ల విలువైన ఎకరం 93 సెంట్ల సర్కారు భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మించారు. ఈ భూమి 22ఎ నిషేధిత జాబితాలో ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జైలు రోడ్డులోని ఆర్ అండ్ బీ అతిథిగృహం వెనుక సర్వే నంబరు 107/7లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. భవన నిర్మాణం దాదాపు పూర్తై, రంగులు అద్దుతున్నారు.
2023లో పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తి చేశారు. అయితే నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్న అధికారులు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రూ.10కోట్ల విలువైన ఎకరం ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మిస్తున్నారు. ఇది చెరువు భూమి. ఈ వ్యవహారం కోర్టులో ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పీ అగ్రహారంలో వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణ దశలో ఉంది. సర్వే నంబర్ 201/3లో సుమారు 72 సెంట్ల స్థలాన్ని వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం కోసం ఇచ్చేశారు. దాని విలువ రూ.7కోట్ల పైమాటే. గృహ నిర్మాణ శాఖకు చెందిన ఈ స్థలాన్ని గతంలో పేదలకు కేటాయించి ఆ తర్వాత రద్దు చేశారు. ఇక్కడి పార్టీ కార్యాలయ శ్లాబ్ పూర్తైంది.
ఏలూరు రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థకు చెందిన రూ.5 కోట్ల విలువైన రెండెకరాల స్థలంలో రాజమహల్‌ను తలదన్నేలా వైఎస్సార్సీపీ కార్యాలయం నిర్మించారు. రెండేళ్ల క్రితం ఈ నిర్మాణం చేపట్టగా ఇటీవలే పూర్తైంది. దీనికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణంపై నిబంధనల మేరకు ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. విజయవాడ విద్యాధరపురంలోని సితార సెంటర్ సమీపంలో రూ.50 కోట్లకు పైగా విలువ చేసే ఎకరం స్థలంలో మూడంతస్తుల్లో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. దీనికీ ఎలాంటి అనుమతులు లేవు. నగరపాలక సంస్థకు రూపాయి కూడా రుసుముల కింద చెల్లించలేదు.
కోర్టు స్థలాలను కూడా వదల్లేదు :కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కోర్టు సెంటర్‌లో రూ.60కోట్లకు పైగా విలువైన 2ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని దర్జాగా కడుతున్నారు. ఈ స్థలంలో ప్రజలందరికీ ఉపయోగపడేలా భోగరాజు పట్టాభి సీతారామయ్య పేరుతో ఓ గ్రంథాలయం, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం నిర్మించాలని ప్రతిపాదనలుండగా వాటిని కాదని కార్యాలయం కట్టుకుంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీని వెనుక ప్రధాన పాత్రధారి. అక్రమంగా నిర్మిస్తున్న భవనానికి ఇప్పుడు ప్లాన్ అప్రూవల్ కోసం మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థకు దరఖాస్తు చేశారు.