YSRCP Activist Trampled Woman to Death with Tractor: తాగునీటి కోసం వచ్చిన గిరిజన మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. రెంటచింతల మండలం మల్లవరం గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. నీళ్లు పట్టుకోవటానికి బాణావత్ సామిని అనే 50 ఏళ్ల మహిళ ట్యాంకర్ వద్దకు వెళ్లారు. అయితే తెలుగుదేశం వాళ్లకు నీళ్లిచ్చేది లేదంటూ వైసీపీకి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మణికంఠ వాహనాన్ని ముందుకు పోనిచ్చారు.
ట్రాక్టర్‌కు అడ్డుగా నిలిచిన సామిని, ట్యాంకర్ వచ్చింది ప్రజలందరి కోసమే కదా అని ప్రశ్నించారు. మంచినీళ్లు ఇవ్వాలని నిలదీయడంతో మణికంఠ ఆమెను బూతులు తిడుతూ వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. ట్రాక్టర్ ముందువైపు బంపర్ ఆమె పొట్ట భాగం వద్ద గట్టిగా తగిలింది. వెనుకవైపు గోడ ఉండటంతో ఆమె తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది. ట్రాక్టర్‌తో తొక్కించటంతో సామిని తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే బంధువులు ఆమెను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
వ్యక్తిపై కర్రలతో దాడిచేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు
మహిళ భర్త సక్రియా నాయక్, కుమారుడు బాలు నాయక్ ఇద్దరూ దివ్యాంగులు. సామిని కూలీ పనులకు వెళ్లి వారిని పోషించేది. ఆమె మృతితో ఇప్పుడు వారిద్దరి పరిస్థితి దయనీయంగా మారింది. సామిని కుటుంబంతో మణికంఠకు గతంలో విభేదాలున్నాయి. మంచినీటి కోసం నిలదీసినప్పుడు కోపంతో ట్రాక్టర్ మీదకు ఎక్కించారనే ఆరోపణలున్నాయి. తాగునీరు అడిగితే చంపేస్తారా అని సామిని కుటుంబసభ్యులు వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తున్నారు.
సామిని హత్య విషయం తెలుసుకున్న మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఈ ఘటనపై ఆగ్రహం వెలిబుచ్చారు. మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. హత్య కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు. హత్య చేసిన వైసీపీ కార్యకర్తను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. లేకపోతే బాధితులతో కలసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.