YSR Cheyutha Scheme Amount Not Credited: ఖాతాలో డబ్బు లేకుండా చెక్కు ఇవ్వడం, మోసం చేయడమే! అచ్చంగా ఇలాంటి పనే జగన్ (YS Jagan Mohan Reddy) చేశారు. చరిత్రలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ లేకుండానే ‘చేయూత’ పథకం చివరి విడత నిధుల విడుదలకు ఆయన ఉత్తుత్తి బటన్ నొక్కారు. ఈ పథకానికిగాను 5 వేల 60 కోట్లు విడుదల చేయాల్సి ఉండగా ఒక్క రూపాయి డబ్బు ఇచ్చేందుకు కూడా ఆర్థికశాఖ నుంచి అనుమతి రాలేదు. ఇది తెలిసీ బహిరంగ సభ పేరిట లబ్ధిదారులను పిలిపించి మరీ వేదికపై నుంచి బటన్ నొక్కారు.
ఇదిగో మీ బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమైపోతాయనేలా కలరింగ్ ఇచ్చారు. గత గురువారం అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన సభలో జగన్ చేసిన ఈ ‘షో’ను రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర వైసీపీ (YSRCP) ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ చేయూత లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ కొనసాగిస్తున్నారు. జగన్ బటన్ నొక్కి ఆరు రోజులయినా ఒక్కరికి కూడా బ్యాంకు అకౌంట్లో డబ్బులు జమ కాలేదు. ఈ పథకం లబ్ధిదారులంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలే. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అంటూ వారికే టోకరా ఇచ్చారంటే జగన్ ఎంత గుండెలు తీసిన బంటో ఇట్టే అర్థమైపోతుంది.
వైఎస్సార్ చేయూత - మహిళల ఉపాధి కల్పనపై జగన్ మాటల గారడీ
ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని: చేయూత పథకం కింద లబ్ధిదారులకు సెప్టెంబర్ నెలలో నిధులు విడుదల చేయనున్నట్లు తొలుత సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారానికి పనికొస్తుందని ఫిబ్రవరిలోనే ఇవ్వాలని నిర్ణయించారు. తొలుత ఫిబ్రవరి 5వ తేదీన విడుదల చేయనున్నట్టు క్షేత్రస్థాయికి సమాచారం పంపారు. ఆ తర్వాత 16కు, 21కి, 26వ తేదీకి ఇలా వాయిదాల మీద వాయిదాలు వేశారు. చివరికి ఈ నెల 7వ తేదీన విడుదల చేశారు. అప్పటికి కూడా నిధుల విడుదల లేకుండానే జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కారు.